Chandrababu: ఇది జోకా ఏంటీ?: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలపై జగన్‌పై చంద్రబాబు విమర్శలు
- ప్రపంచం మొత్తం కరోనా సమస్య
- ప్రపంచం ఈ పరిస్థితుల నుంచి బయట పడడానికి పోరాడుతోంది
- జగన్ మాత్రం అధికారులతో సమావేశమవుతున్నారు
- ఎన్నికల కోసం కొత్త షెడ్యూలుకు ప్రయత్నాలు
ఓపక్క, కరోనా విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతుంటే.. మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.
'ఇది జోకా ఏంటీ? ప్రపంచం మొత్తం కరోనా వల్ల ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల నుంచి బయట పడడానికి పోరాడుతుంటే వైఎస్ జగన్ మాత్రం అధికారులతో సమావేశమవుతూ స్థానిక ఎన్నికల కోసం కొత్త షెడ్యూలు ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నారు. కరోనా వల్ల ఏర్పడుతున్న పరిస్థితుల నుంచి ఆయన నేర్చుకోవట్లేదు.. షాకింగ్' అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను చంద్రబాబు పోస్ట్ చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో దక్షిణ కొరియాలో బాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోందని ఆ పత్రికల్లో పేర్కొన్నారు. కాగా, ఏపీలో గత నెలలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే.