NHAI: ఈ నెల 20 నుంచి ‘టోల్’ తీసేందుకు రెడీ అవుతున్న ఎన్‌హెచ్ఏఐ

NHAI to resume toll collection on national highways from April 20
  • లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి టోల్ వసూలు నిలిపివేత
  • 20 నుంచి మళ్లీ వసూలు చేయాలంటూ ఎన్‌హెచ్ఏఐకి కేంద్రం లేఖ
  • ఆదుకోవాల్సిన సమయంలో ఇది సరికాదంటున్న రవాణా సంఘాలు
గత నెల రోజులుగా ఆగిన టోల్ వసూళ్లు మళ్లీ మొదలుకానున్నాయి. ఈ నెల 20 నుంచి టోల్ రుసుమును వసూలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) రంగం సిద్ధం చేస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గత నెల 24న కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే, అంతర్ రాష్ట్రాల పరిధిలో నిత్యావసర సరుకులు మోసుకెళ్లే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలపై భారం తగ్గించేందుకు కేంద్రం టోలు వసూలును నిలిపివేసింది. గత నెల 25 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

తాజాగా, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్ఏఐకి లేఖ రాస్తూ ఏప్రిల్ 20 నుంచి టోలు వసూలు మొదలుపెట్టాలని సూచించింది. కేంద్రం సూచనపై రవాణా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైందని, ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిత్యావసర సరుకుల రవాణా కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం సరికాదని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. రవాణా రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొంది.
NHAI
Lockdown
Corona Virus
AIMTC

More Telugu News