Zomato: 'దినసరి కూలీ'ల ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జొమాటో!

How Zomatos Feeding India Initiative Is Making Life Better For Daily Wage Workers Amid The Lockdown
  • ఎన్జీవోల సాయంతో సేవా కార్యక్రమాలు
  • బిగ్‌బజార్‌తో పాటు పలు సంస్థలతో భాగస్వామ్యం
  • దేశ వ్యాప్తంగా పేదలకు ఉచితంగా గోధుమ పిండి, బియ్యం
  • గతంలో వరదల సమయంలోనూ జొమాటో సాయం
లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. అన్ని వ్యవస్థలూ బాగా పనిచేస్తున్న సమయంలోనూ ఎంతో మందికి కేవలం ఒక్క పూట భోజనమే దొరుకుతుంది. అటువంటిది లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. దేశంలోని 90 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నావారే.

అంటే 450 మిలియన్ల మంది ప్రజలు దినసరి వేతనాలపై ఆధారపడి బతుకుతున్నారు. నిర్మాణ రంగ కార్మికులు, దుకాణాల్లో, రెస్టారెంటుల్లో, రవాణా రంగాల్లోని కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రేపటి రోజు ఎలా గడుస్తుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది.                                        
                           
 ఇటువంటి పరిస్థితుల్లో ఆహార సరఫరా సంస్థ జొమాటో ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'దినసరి కూలీకి ఆహారం' అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఆకలితో నిద్రించే వారి సంఖ్య కాస్తయినా తగ్గించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

ఫీడ్‌ డైలీ వేజర్‌ కార్యక్రమంలో భాగంగా.. ఇన్నాళ్లు దినసరి కూలీలుగా పనిచేసి ప్రస్తుతం కుటుంబాలకు ఆహారం అందించలేకపోతున్న వారికి  రేషన్‌ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు జొమాటో ప్రతినిధులు తమ వెబ్‌సైట్‌ ద్వారా తెలిపారు.

అందులో బియ్యంతో పాటు గోధుమ పిండి వంటివి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కిట్‌ విలువ రూ.500 అని, వాటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం తాము నగరాల్లోని స్థానిక ఎన్‌జీవోలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూనే ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
                                                       
                   
ఇందుకోసం దాతల నుంచి మొత్తం రూ.50 కోట్లు అవసరముంటుందని చెప్పారు. ఇందుకోసం తమ సైట్‌ ద్వారా ఎవరైనా దాతలు వారానికి కనీసం రూ.500 విరాళం అందించాలని వారు కోరారు. దాతల నుంచి విరాళాలే కాకుండా గ్రోఫెర్స్‌, బిగ్‌ బజార్ వంటి సంస్థలతోనూ తాము కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. పలు నగరాల్లో వారి సాయంతో రేషన్‌ కిట్స్‌ అందుకుంటున్నట్లు తెలిపారు.

                                                                      
విరాళాల సేకరణలో పారదర్శకత పాటించడానికి తాము నిధుల ఖర్చు అంశాలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుపుతున్నామని చెప్పారు. ఇది 100 శాతం నాన్‌ ప్రాఫిట్‌ క్యాంపెయిన్ అని తెలిపారు. గతంలోనూ తాము దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో పెద్ద ఎత్తున రేషన్‌ సరఫరా చేశామని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితులు అప్పటి కన్నా ఎన్నో రెట్లు అధిక సవాళ్లను ఎదుర్కొనేలా ఉన్నాయని జొమాటో ప్రతినిధులు తెలిపారు. వారి సేవల పట్ల సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలకే కాకుండా వీరి సేవలకు కూడా సెల్యూట్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Zomato
India
Lockdown

More Telugu News