Hyderabad: లారీలో హైదరాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌ వెళ్లబోయిన 80 మంది కూలీలు.. పట్టుకున్న పోలీసులు

Hyderabad police intercepts lorry carrying 80 migrant labourers to MP
  • టోలీచౌకి, అఫ్జల్‌గంజ్‌ నుంచి బయలుదేరిన కూలీలు
  • ప్రమాదకర స్థితిలో లారీలో ప్రయాణం
  • సొంత గ్రామాల్లో ఉంటే రేషన్‌ సరుకులైనా దొరుకుతాయని వ్యాఖ్య
  • ఆహారం అందిస్తామని చెప్పిన పోలీసులు
దేశంలో కరోనా విజృంభణ తగ్గకపోవడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో వలస కూలీలు పెద్ద ఎత్తున తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో వారు పోలీసుల కళ్లు గప్పి వెళ్లాలనుకునే క్రమంలో వస్తువుల సరఫరా వాహనాల్లో ప్రమాదకర స్థితిలో ప్రయాణించాలనుకుంటున్నారు.

హైదరాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌ వెళ్లాలని ఇదే విధంగా ప్రయత్నాలు జరిపిన దాదాపు 80 మంది కూలీలను పోలీసులు గుర్తించారు. ఓ గూడ్స్ లారీలో టోలీచౌకి, అఫ్జల్‌గంజ్‌ నుంచి కూలీలు వెళ్లడానికి ప్రయత్నించారని వారిని చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్నామని పోలీసులు మీడియాకు తెలిపారు.

లాక్‌డౌన్‌ను పొడిగించడంతో తాము వెళ్లాలని నిర్ణయించుకున్నామని కూలీలు తమతో చెప్పారని పోలీసులు వివరించారు. ఇటువంటి ప్రయత్నాలు చేసి, ప్రమాదంలో పడొద్దని చెప్పామని తెలిపారు. వారికి నిత్యావసరాలు అందిస్తామని చెప్పామని పోలీసులు చెప్పారు. తమకు కొన్ని రోజులుగా తినడానికి తిండి కూడా దొరకట్లేదని కూలీలు మీడియాతో చెప్పి వాపోయారు.

ఇక్కడ కూలిపనికోసం వచ్చి తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, తమ సొంత గ్రామాల్లో ఉంటే అక్కడ రేషన్‌ కార్డు ద్వారానైనా సరుకులు ఇస్తారని చెప్పారు. ఇక తొలి దశ లాక్‌డౌన్‌ విధించిన మొదట్లోనూ దేశ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులే కనపడ్డాయి. మరోసారి లాక్‌డౌన్‌ విధించడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలని భారీ ఎత్తున మరోసారి ప్రయాణాలు మొదలు పెడుతున్నారు.
Hyderabad
Hyderabad Police
Lockdown
COVID-19

More Telugu News