Lockdown: లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో మరిన్ని సవరణలు చేస్తూ కేంద్రం ప్రకటన

coronavirus cases in india
  • అటవీ ప్రాంతాల్లో గిరిజనులు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు
  • వ్యవసాయ కార్యకలాపాల్లో అటవీ ఉత్పత్తులు
  • కొబ్బరితో పాటు వెదురు,  సుగంధ ద్రవ్యాల సాగుకు అవకాశం
  • తక్కువ సిబ్బందితో పనిచేసే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తూ నిన్న ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి పలు లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో భారత్‌లోని ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాన్నిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో మరికొన్ని సవరణలు చేసింది.

అటవీ ప్రాంతాల్లో గిరిజనులు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెలిపింది. వ్యవసాయ కార్యకలాపాల్లో అటవీ ఉత్పత్తులతో పాటు కలప సేకరణను చేర్చుతున్నట్లు పేర్కొంది. కొబ్బరితో పాటు వెదురు,  సుగంధ ద్రవ్యాల సాగు, ప్యాకేజింగ్‌కు అవకాశం కల్పించింది.

అంతేగాక, ఆయా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అలాగే, తక్కువ సిబ్బందితో పనిచేసే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్‌, టెలిఫోన్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ లైన్ల పనులకు అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

వినియోగదారులు కొనుగోలు చేసిన  ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను వారికి అందించేందుకు  ఈ-కామర్స్‌ సైట్లకు సంబంధించిన వాహనాలకు దేశంలో అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ-కామర్స్‌ సంస్థల వాహనాలకు ఆయా ప్రాంతాల్లో స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం మాత్రం తప్పనిసరి అని చెప్పింది.

ఈ-కామర్స్‌ సంస్థల నుంచి మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, బట్టలతో పాటు బడి విద్యార్థుల కోసం స్టేషనరీ వస్తువులు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిని వినియోగదారులకు అందించేందుకే వాహనాలకు అనుమతులు ఇచ్చింది. ఈ నెల 20 నుంచి కేంద్ర ప్రభుత్వ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. ఆ రోజు నుంచే ఈ కొత్త సడలింపులు అమల్లోకి రానున్నాయి.
Lockdown
Corona Virus
India

More Telugu News