English Medium: ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వం

YSRCP govt decides to move to Supreme Court over english medium
  • ఇంగ్లీష్ మీడియం విద్య జీవోలను ఆపేసిన హైకోర్టు
  • న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామన్న మంత్రి ఆదిమూలపు
  • ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని వ్యాఖ్య
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశ పెట్టాలనుకున్న వైసీపీ ప్రభుత్వ ఆశలపై ఏపీ హైకోర్టు నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించిన రెండు జీవోలను ఆపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ మీడియంలో చదవాలనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారని వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించి, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

హైకోర్టు తీర్పును గెలుపు, ఓటమి అంశంగా చూడకూడదని ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంతో పాటే తెలుగు మీడియంను కూడా కొనసాగిస్తామని చెప్పామని... అయినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని తెలిపారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని కొందరు నేతలు అంటున్నారని... విపక్షాల ఆలోచనా విధానం ఎలా ఉంటుందన్న దానికి ఇదొక  నిదర్శనమని చెప్పారు.

పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదని టీడీపీ కోరుకుంటోందని ఆదిమూలపు సురేశ్ విమర్శించారు. ఇంగ్లీష్ మీడియం విద్య అనేది ఒక విప్లవాత్మక నిర్ణయమని చెప్పారు. తెలుగులో చదువుకుంటామనుకునే వారి కోసం ప్రతి మండలంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో తెలుగు సబ్జెక్ట్ కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు.
English Medium
Andhra Pradesh
YSRCP
AP High Court
Supreme Court

More Telugu News