Chandrababu: వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది: చంద్రబాబునాయుడు
- ‘కరోనా’ కేసులను దాచిపెట్టడం మంచిది కాదు
- అలా చేయడం వల్లే కర్నూలు, నెల్లూరులో కేసులు పెరిగిపోయాయి
- వైద్యులు, సిబ్బందికి రక్షణ ఉపకరణాలు అందించాలి
ఏపీలో ‘కరోనా’ కేసులను దాచిపెట్టడం మంచిది కాదని, అలా చేయడం వల్ల ఆ వైరస్ మరింతగా వ్యాపిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తమ పార్టీ నేతలతో మాట్లాడారు. ‘కరోనా’ కేసులను దాచిపెట్టడం వల్ల జరిగే పరిణామాలకు ఉదాహరణ కర్నూలు, నెల్లూరు జిల్లాలేనని అన్నారు ‘కరోనా’పరీక్షలకు సంబంధించిన వివరాలపై వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని, అందువల్లే రాష్ట్రంలో ఈ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని విమర్శించారు.
‘కరోనా’ రోగులను కాపాడే వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ నిచ్చే ఉపకరణాలు అవసరమని, అవి లేకపోవడం వల్లే వారు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి రక్షణ ఉపకరణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీలో రేషన్ సరఫరా తీరుపై, తెల్లకార్డుదారులకు ప్రభుత్వం అందజేస్తానని ప్రకటించిన రూ.1000 నగదు సాయంపై ఆయన విమర్శలు గుప్పించారు.
రేషన్ దుకాణాల్లో వినియోగదారులకు పంచదార ఇచ్చిన తర్వాత పది రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయల సాయం అందరికీ అందలేదని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ ఏకాభిప్రాయం తీసుకొచ్చారని ప్రశంసించారు. మన దేశంలో తొలి విడత లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని, అందుకే, రెండో విడత లాక్ డౌన్ ను ప్రకటించారని అన్నారు.