Khammam District: మధిరలో పార్టీ చేసుకున్న కోవిడ్ అధికార బృందంపై కేసు నమోదు

Khammam Police file case against Covid Officials
  • తహసీల్దారు, ఈవోపీఆర్డీ, సబ్ జైలర్, పీహెచ్‌సీ వైద్యాధికారిపై కేసు నమోదు
  • అందరూ కలిసి గెస్ట్ హౌస్‌లో పార్టీ
  • ఆర్ఐ, వీఆర్వో కూడా ఉన్నారన్న పోలీసులు
బాధ్యత మరిచి, లాక్‌డౌన్‌ ఆంక్షలను అటకెక్కించి పార్టీ చేసుకున్న మండల కోవిడ్ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ సైదులు, ఈవోపీఆర్డీ రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా మధిర బస్టాండ్ సమీపంలోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో మందు పార్టీ చేసుకుంటూ మీడియాకు దొరికిపోయారు.

మీడియాను చూసి పార్టీ చేసుకుంటున్న వారంతా తలో దిక్కుకు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గెస్ట్ హౌస్‌కు చేరుకుని పరిశీలించారు. ఖరీదైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మటూరుపేట పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో ఆయన వెల్లడించిన వివరాల ఆధారంగా నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీఆర్వో గంటా శ్రీనివాసరావు, ఆర్ఐ మధుసూదన్‌రావు కూడా ఈ పార్టీలో ఉన్నట్టు తేలిందని పోలీసులు తెలిపారు. కాగా, భౌతిక దూరాన్ని మరిచి, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అధికారులు పార్టీ చేసుకున్న వార్తలు అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
Khammam District
Madhira
Liquor party
corvid officials
Telangana

More Telugu News