Lockdown: లాక్‌డౌన్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోం శాఖ

coronavirus cases in india and lock down
  • వైద్య సేవలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు
  • నిత్యావసరాలు మినహా దేశంలోని అన్ని సంస్థలు మూసి వేసే ఉంచాలి
  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు టెలీ కమ్యునికేషన్లకు మినహాయింపు
  • సామాజిక దూరం పాటించాలి
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు  కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని ఆసుపత్రులతో పాటు వెటర్నరీ ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, లేబొరేటరీలు, క్లినిక్‌లతో పాటు అత్యవసర విభాగాలన్నీ ఎప్పటిలాగే పనిచేస్తాయి.

నిత్యావసరాలు మినహా దేశంలోని అన్ని వాణిజ్య, ప్రైవేటు సంస్థలు మూసి వేసే ఉంచాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు టెలీ కమ్యునికేషన్లు, ఇంటర్నెట్ సేవలు, ప్రసార, కేబుల్ సర్వీసులు వంటి వాటికి లాక్‌డౌన్ నుంచి యథాతథంగా మినహాయింపు ఇచ్చారు.

దేశంలోని పారిశ్రామిక సంస్థలతో పాటు ప్రజా రవాణా సర్వీసులు, హోటళ్లు విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్లపై నిషేధం ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం వంటి ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలి. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత కొనసాగుతుంది.

కానీ, రక్షణ, కేంద్ర సాయుధ బలగాలు, ప్రజా వినియోగాలు, విద్యుదుత్పత్తి, జాతీయ సమాచార కేంద్రాలు వంటి సంస్థలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. రాష్ట్రాల్లో పోలీసులు, అత్యవసర సేవలు, జిల్లా యంత్రాంగం, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం వంటి వాటికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విభాగాలు వంటి సేవలకు  లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

Lockdown
India
Corona Virus

More Telugu News