Rahul Gandhi: టేకోవర్లకు విదేశీ పారిశ్రామిక గెద్దలు పొంచివున్నాయి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరిక

affect from Foreign Takeovers says Rahul Gandhi
  • హెచ్‌డీఎఫ్‌సీ షేర్స్ చైనా సెంట్రల్ బ్యాంకు కొనుగోలు ఇందుకు ఉదాహరణ
  • కోవిడ్-19 సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం
  • కేంద్రం అప్రమత్తం కాకుంటే దేశీయ పరిశ్రమలకు ఇబ్బందే
కోవిడ్-19 కారణంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని 'టేకోవర్' పేరుతో హస్తగతం చేసుకునేందుకు విదేశీ పారిశ్రామిక గెద్దలు పొంచివున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా హౌసింగ్ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ (హెచ్ డీఎఫ్సీ)లో 1.75 కోట్ల షేర్ల కొనుగోలు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ అని ఆయన హెచ్చరించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విదేశీ సంస్థలు మన కార్పొరేట్లను హస్తగతం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని రాహుల్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు.

విపక్ష నాయకుడిగా రాహుల్ హెచ్చరికల సంగతి పక్కన పెడితే ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థపై ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. జీడీపీ వృద్ధిరేటు అంచనాలు తలకిందులుగా మారాయి. 'భారత్ ఈ ఆర్థిక సంవత్సంలో అంచనాల మేరకు 4.8 నుంచి 5 శాతం ఆర్థికాభివృద్ధి సాధించడం కష్టమే. ఇది 1.5 నుంచి 2.8 శాతం దాటక పోవచ్చు' అని ఇప్పటికే ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.

కరోనా విపత్తు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని ప్రపంచ ఆర్థిక దిగ్గజం ఐఎంఎఫ్ కూడా హెచ్చరించడం గమనార్హం. ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆర్థిక రంగం స్థితిగతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. 'మనుషుల ప్రాణాలతోపాటు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సి  ఉంది. మనిషి మనుగడ ఉంటేనే ప్రపంచం ఉంటుంది. అందువల్ల ప్రపంచాన్ని కాపాడుకోవాలంటే మనిషి మనుగడను ముందు కాపాడాలి' అన్న ప్రధాని వ్యాఖ్యలు గమనించాల్సినవి.

ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరించినట్టే లాక్ డౌన్ దేశీయ ఆర్థిక రంగాన్ని కుదుపుకుదిపింది. వ్యాపార, ఆర్థిక రంగాలు కుదేలైపోయాయి. ఈ పరిస్థితుల్లో దెబ్బతిన్న భారతీయ ఆర్థిక వ్యవస్థలోకి చొచ్చుకు రావాలన్న విదేశీ పరిశ్రమల అడుగులకు బ్రేక్ వేయకుంటే ప్రమాదం పొంచివున్నట్టే.
Rahul Gandhi
Twitter
Indian Economy

More Telugu News