Jagan: అధికారులతో సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సీఎం జగన్‌

jagan on corona
  • ఒక్కొక్కరికి మూడు చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి ఆదేశాలు
  • వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపై నిషేధం
  •  ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష  .
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు, అధికారులు హాజరయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఒక్కొక్కరికి మూడు చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు. వీటి వల్ల కరోనా వల్ల కొంత రక్షణ లభిస్తుందని తెలిపారు.

కరోనా హైరిస్క్‌ ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. ఏపీలో వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు తరలించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు   అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
 
కాగా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. ఉమ్మివేయడం, పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై నిషేధం విధించింది. ఏపీలో ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు.
.
Jagan
Andhra Pradesh
Corona Virus
Lockdown

More Telugu News