Surat: వలస కార్మికుల్లో ఆందోళన... లాక్ డౌన్ పొడిగిస్తారన్న భయంతో సూరత్ పోలీసులపై రాళ్లు!

Stone Pelting on Police Over Lockdown Extend Fear
  • వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది మంది
  • స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని నిరసన
  • కేసులు పెట్టి, అరెస్ట్ చేసిన పోలీసులు

ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్ డౌన్ కొనసాగితే, తమ పరిస్థితి ఏంటన్న తీవ్ర ఆందోళనలో ఉన్న వలస కార్మికులు, పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిన సూరత్ లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, సూరత్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది పలు వస్త్ర పరిశ్రమల్లో పని చేస్తున్నారు. గత నెలలో విధించిన లాక్ డౌన్ తో వీరంతా ఉపాధిని కోల్పోయి, రోడ్డున పడ్డారు. తమతమ స్వస్థలాలకు వెళ్లలేని వీరంతా, 15న లాక్ డౌన్ ముగియగానే వెళ్లిపోవాలన్న ఆలోచనతో ఉన్నారు.

ఇదే సమయంలో లాక్ డౌన్ పొడిగిస్తారన్న వార్తలతో వారు నిరసనలకు దిగారు. తమకు వేతనాలు ఇప్పించాలని, ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ, రోడ్డెక్కారు. తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించిన వేళ, దాదాపు 70 మంది వలస కార్మికులు వారిపైకి రాళ్లు విసిరారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నామని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై రాళ్లేసినందుకు కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రజలు సంయమనంతో ఉండాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు కోరారు.

  • Loading...

More Telugu News