Corona Virus: ఏపీలో 'కొవిడ్ వారియర్స్' గా 2000 మంది వైద్య విద్యార్థులు, అప్రెంటిస్ లు!

Huge response for covid warriors initiative established by AP government
  • వైద్య సిబ్బంది కొరత రాకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు
  • 'కొవిడ్ వారియర్స్' పేరిట మెడికల్ వలంటీర్ల బృందం
  • అనుభవాన్ని బట్టి సేవలు వినియోగించుకుంటామన్న ప్రభుత్వం
ఏపీలోనూ కరోనా రక్కసి కోరలు చాచి విజృంభిస్తోంది. నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే రోగుల సంఖ్య మరింత పెరిగితే వైద్యులు, ఇతర సిబ్బంది కొరత రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా, 'కొవిడ్ వారియర్స్' పేరిట ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ బృందంలో ఇప్పటివరకు 2000 మంది వైద్య విద్యార్థులు, అప్రెంటిస్ లు చేరారు. వారే కాకుండా, ప్రైవేటు వైద్యులు, నర్సుల సేవలు కూడా ఉపయోగించుకోవాలని ఏపీ సర్కారు భావిస్తోంది.

దీనిపై కొవిడ్-19 స్పెషల్ ఆఫీసర్ ఎం. గిరిజా శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది అవసరం ఉందని, అందుకే 271 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుర్వేదిక్, యునానీ కాలేజీల నుంచి స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారి కోసం ఈ 'కొవిడ్ వారియర్స్' పథకం తీసుకువచ్చామని తెలిపారు. వైద్య విద్యార్థులే కాకుండా, ఆసక్తివున్న మెడికల్ ప్రాక్టీషనర్లు, స్పెషలిస్టులు, నర్సింగ్ కోర్సులు పూర్తిచేసినవారు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఎవరైనా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు.

ఈ మెడికల్ వలంటీర్లలో అనుభవం ఉన్నవారిని కరోనా ఆసుపత్రుల్లో వినియోగించుకుంటామని, వైద్య విద్యార్థులను క్వారంటైన్ సెంటర్లలో నియమిస్తామని తెలిపారు. వారికి కొవిడ్-19 పేషెంట్లకు ఎలా చికిత్స అందించాలో శిక్షణ ఇస్తామని గిరిజా శంకర్ వివరించారు. కోవిడ్ వారియర్స్ గా తీసుకునే అనుభవం కలిగిన ప్రైవేటు వైద్య నిపుణులకు, పారా మెడికల్ సిబ్బందికి వారి సేవలను బట్టి వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. మెడికల్ వలంటీర్లుగా ముందుకువచ్చేవారికి వేతనాలు ఉండవని,  ప్రయాణ ఖర్చులు, ఆహార భత్యాలు భరిస్తామని, వారికి పీపీఈ కిట్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.
Corona Virus
Andhra Pradesh
Covid Warriors
Medical Volunteers

More Telugu News