Bill Gates: కరోనా వాక్సిన్ కోసం వేల కోట్లు వెచ్చిస్తున్న బిల్ గేట్స్!

Bill Gates Announces Billions of Dollors to Make Corona Vaccine

  • 7 రకాల వాక్సిన్ ల అభివృద్ధికి నిధులు
  • తుది దశలో ఉత్తమంగా పనిచేసే రెండు వాక్సిన్ ల తయారీ
  • మాన్యుఫాక్చరింగ్ కేంద్రాన్ని నిర్మిస్తామన్న గేట్స్

కరోనా వైరస్ ను హతమార్చే 7 రకాల వాక్సిన్ లను అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల రూపాయలను వెచ్చించాలని నిర్ణయించినట్టు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. 'ది డెయిలీ షో'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వాక్సిన్ తయారీ మాన్యుఫాక్చరింగ్ కేంద్రాన్ని కూడా నిర్మిస్తుందని స్పష్టం చేశారు. తయారయ్యే 7 వాక్సిన్ లలో రెండు అత్యుత్తమ వాక్సిన్ లను ఫైనల్ ట్రయల్స్ కు స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ప్రపంచం నుంచి తరిమేయడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సమయం వృథా కారాదన్న ఉద్దేశంతోనే, ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఏడు వాక్సిన్ లకూ నిధులివ్వాలని నిర్ణయించామని, ఏ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుందో ఇప్పటికిప్పుడు తెలిపే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రెండు వాక్సిన్ లను తుది దశలో ఎంపిక చేసిన తరువాత వాటి తయారీ పెద్దఎత్తున జరుగుతుందని బిల్ గేట్స్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో కొన్ని వేల కోట్ల నిధులు వృథా అవుతాయని, ఇదే సమయంలో ఇంకొన్ని వేల కోట్లు ప్రపంచ కష్టాలను తొలగించేందుకు ఉపయోగపడతాయన్న నమ్మకం తనకుందని తెలిపారు. లక్షల కోట్ల డాలర్లు ఖర్చయినా, వైరస్ కు వాక్సిన్ లభిస్తే, అదే ఎంతో సంతోషకరమైన విషయమని వ్యాఖ్యానించారు.

కాగా, వాక్సిన్ తయారీ తరువాత, మానవులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయి, వాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు 12 నుంచి 18 నెలల వరకూ సమయం పడుతుందని శాస్త్రవేత్తల అంచనా. కాగా, అమెరికాలో లక్షలాది మరణాలు సంభవిస్తాయని, మరో వారం పది రోజులు అత్యంత కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షల ముప్పై ఆరు వేలు దాటగా, 9,600 మందికి పైగా మరణించారు.

ఇదిలావుండగా, తాము వాక్సిన్ కోసం చేస్తున్న కృషికి, ప్రభుత్వం తనవంతు సహకారాన్ని అందించాలని బిల్ గేట్స్ విజ్ఞప్తి చేశారు. అల్పాదాయ, మధ్యాదాయ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనే పరిస్థితుల్లో లేవని, ఆయా దేశాలను మనమే ఆదుకోవాల్సి వుందని అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా, సౌత్ ఆసియాలోని దేశాలను ఆదుకోవడం ద్వారా, ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని, వైరస్ మిగతా ప్రపంచానికి వ్యాపించకుండా చూడవచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News