Muslim: ఒకరు మనల్ని నిందించే పరిస్థితి తేవద్దు: ముస్లింలకు ఐఏఎస్, ఐపీఎస్ ల విజ్ఞప్తి!

Appeal form Muslim IAS and IPS Officers to Community
  • హెల్త్ వర్కర్లు, పోలీసులపై దాడులు చేయవద్దు
  • ముస్లింలంతా సామాజిక దూరాన్ని పాటించాలి
  • వ్యాధిని వ్యాపింపజేయడం ఖురాన్ ప్రకారం మహాపాపం
  • ఓ బహిరంగ లేఖలో మాజీ, ప్రస్తుత అధికారులు
ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తికి ముస్లింలే కారణమని మరొకరు నిందించే పరిస్థితిని తెచ్చుకోవద్దని దాదాపు 80 మంది ప్రస్తుత, పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ముస్లిం కమ్యూనిటీకి విజ్ఞప్తి చేశారు. ముస్లిం సోదరులంతా భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసిన వారు, ముస్లిం సమాజానికి బహిరంగ లేఖను రాశారు. ఇండియాలో పెద్ద సంఖ్యలో ముస్లింలు ఓ చోట చేరినందునే వైరస్ వ్యాప్తి చెందుతోందని, వారు బయటకు వచ్చిన తరువాత కూడా సామాజిక దూరాన్ని పాటించకుండా మహమ్మారి వ్యాపించేందుకు కారణం అవుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరు ఈ లేఖను విడుదల చేయడం గమనార్హం.

"తమను పరీక్షించేందుకు వచ్చిన హెల్త్ వర్కర్లపై దాడులు చేయడం, పోలీసులపై దాడులు వంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు కూడదు. ఇవి అశాంతిని పెంచుతాయి. మసీదుల్లోకి పెద్ద సంఖ్యలో వెళ్లవద్దు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, కరోనాపై పోరాటంలో స్ఫూర్తి నిచ్చే భారతీయులుగా నిలవాలి" అని కోరారు. ఈ సందర్భంగా ఖురాన్ లోని కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు. ఏదైనా రోగాన్ని ఇతరులకు అంటించడం ఖురాన్ ప్రకారం, పాపమని వారు గుర్తు చేశారు. నిర్లక్ష్యంగా ఉండటం కూడా నేరమేనని, వైరస్ లక్షణాలు కనిపించగానే, వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ఈ వైరస్ కేవలం మానవ శరీరంలో దాగి, ఒక్కరికి మాత్రమే పరిమితం కాదని, అతని అవివేక చర్యల కారణంగా ఇతరులకు వ్యాపిస్తుందని, వైరస్ సోకిన వ్యక్తి నుంచి తొలుత కుటుంబ సభ్యులకు, ఆపై, సమాజంలోని ఇతరులకు, వారి నుంచి వందల, వేల మందికి సోకుతుందని, దీని కారణంగా లెక్కలేనన్ని మరణాలు సంభవిస్తాయని వీరు తమ లేఖలో హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముస్లింలంతా బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని కోరారు.

 ఓ అమాయక ప్రాణాన్ని బలిగొంటే, అది మొత్తం మానవాళిని హతమార్చినంత పాపమని, అదే ఓ ప్రాణాన్ని కాపాడితే, మానవాళిని రక్షించినంత పుణ్యమని ఖురాన్ చెబుతోందని వారు గుర్తు చేశారు. ఒకసారి కరోనా అంతరించిన తరువాత, ముస్లిం సమాజమంతా మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు పెద్దఎత్తున హాజరు కావచ్చని, అంతవరకూ మాత్రం ఇళ్లకే పరిమితం కావాలని వారు సూచించారు.
Muslim
Community
Open Letter
IAS
IPS
Corona Virus

More Telugu News