Chandrababu: ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధి పనులు ఆగిపోవడం బాధాకరం: చంద్రబాబు
- ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేద్దామనుకున్నాం
- అప్పట్లో రూ.100కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం
- ప్రతిఏటా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేశాం
- అందరూ ఆరోగ్యంగా ఉండాలి
శ్రీరామ నవమి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు వ్యాఖ్యలు చేశారు. 'ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒక ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన ఉత్తమ పాలకుడు శ్రీరాముడు. అధికారాన్ని ప్రజోపయోగంగా ఎలా వినియోగించాలో రాముడు మనకు తెలియచెప్పాడు. అందుకే గాంధీజీ సైతం స్వతంత్ర భారతదేశం రామరాజ్యంలా విలసిల్లాలని కోరుకున్నారు' అని ట్వీట్లు చేశారు.
'విభజన కారణంగా భద్రాద్రిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ లోటు కనపడనీయకుండా, కడప జిల్లాలో 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతిఏటా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేశాం' అని చంద్రబాబు చెప్పారు.
'అలాంటిది గత ఏడాదిగా ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధి పనులు ఆగిపోవడం బాధాకరం. ప్రతి ఏటా వీధివీధినా చలువపందిళ్లలో వేడుకగా జరిగే సీతారాముల కల్యాణోత్సవాలు ఈ ఏడాది కరోనా వల్ల ఇళ్లకే పరిమితం అయ్యాయి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, రాజ్యం సుభిక్షంగా ఉండాలనేదే కోదండరాముడి ఆకాంక్ష' అని అన్నారు.
'ఈ పండుగవేళ ఇళ్లకే పరిమితమై శ్రీరాముని దివ్య చరిత్రను మననం చేసుకుందాం. మన ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యంతోపాటు సమాజ ఆరోగ్యం కాపాడదాం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.