Donald Trump: చైనా చెబుతున్న కరోనా మరణాల సంఖ్యపై ట్రంప్‌ అనుమానాలు!

Trump casts doubt on Chinese coronavirus figures
  • చైనా మరణాలపై ఇటీవల శ్వేతసౌధానికి నిఘా వర్గాల నివేదిక
  • మరణాలపై చైనా అసత్యాలు చెప్పిందన్న ట్రంప్
  • జిన్‌పింగ్‌తో తాము సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని వ్యాఖ్య
  • చైనాలో కంటే అమెరికాలో కరోనా మరణాలు ఎక్కువ కాదంటోన్న రిపబ్లికన్లు
కరోనా వల్ల చైనాలో సంభవించిన మరణాల సంఖ్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. చైనాలో మరణాలపై ఇంటెలిజన్స్‌ రిపోర్టు అందిందని, మరణాల సంఖ్యను బయటకు తెలియనివ్వకుండా చైనా కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. 'వారు నిజాలే చెబుతున్నారా? అన్న విషయం మనకేం తెలుసు' అని వ్యాఖ్యానించారు.

చైనా మరణాల సంఖ్యను తక్కువగా చూపెడుతోందేమోనని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తాము సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇటీవల కరోనా వైరస్ పుట్టుక గురించి చైనా, అమెరికా పరస్పరం ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికా సైన్యమే తమ దేశంలోకి కరోనాను తీసుకొచ్చిందని చైనా కొన్ని రోజుల క్రితం ఆరోపించింది.

ఇదిలావుంచితే, యూఎస్‌ నిఘా వర్గాలు తెలిపిన సమాచారం అంటూ ఇటీవల బ్లూమ్‌బర్గ్ పలు విషయాలు ప్రచురించింది. వుహాన్‌లో మరణాలపై అంతర్జాతీయ సమాజాన్ని చైనా తప్పుదోవ పట్టించిందని అందులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వారం రోజుల క్రితం నిఘా వర్గాలు శ్వేతసౌధానికి పంపాయని తెలిపింది.

కాగా, తమ దేశంలో 82361 పాజిటివ్‌ కేసులు, 3316 మరణాలు సంభవించాయని చైనా చెబుతోన్న విషయం తెలిసిందే. అమెరికాలో మాత్రం ఇప్పటికే 260207 కేసులు, 4542 మరణాలు సంభవించాయి. రిపబ్లికన్‌ సెనేటర్‌ బెన్ స్యాస్‌ కూడా చైనా చెబుతున్న లెక్కలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా కేసులపై చైనా చేస్తున్నది 'చెత్త ప్రచారం' అని విమర్శించారు. నిజానికి చైనాలో కంటే అమెరికాలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయన్న లెక్కలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా కేసులపై చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ అసత్యాలు చెబుతోందని, తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి అసత్యాలు చెబుతూనే ఉంటుందని విమర్శించారు.
Donald Trump
China
Corona Virus

More Telugu News