H-1B Workers: ‘కరోనా’ ప్రభావం.. హెచ్-1బీ వీసా గడువు పెంచాలంటూ ‘వైట్ హౌస్’ కు వినతుల వెల్లువ

H1B Workers Seek 180 Instead of 60 day Stay in US
  • హెచ్-1బీ వీసాపై వెళ్లిన వారిలో భయాందోళనలు 
  • ఒకవేళ ఉద్యోగాలు కోల్పోతే నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లలేం
  • గడువును 60 నుంచి 180 రోజులకు పెంచాలని వినతులు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడనుండటంతో, తాము ఉద్యోగాలు కోల్పోతామేమోనన్న ఆందోళనతో అక్కడికి హెచ్-1బీ వీసాపై వెళ్లిన వాళ్లు బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే, ఈ వీసాపై అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తున్న వాళ్లు ఒకవేళ తమ ఉద్యోగం కనుక కోల్పోతే అరవై రోజుల్లోగా కొత్త ఉద్యోగం సంపాదించుకోవాలి. లేనిపక్షంలో ఆ దేశం విడిచి వెళ్లిపోవాలన్నది నిబంధన. ‘కరోనా’ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్న నిపుణుల అంచనా మేరకు, ఈ వీసాపై అమెరికా వెళ్లిన వారు ఆలోచనలో పడ్డారు.

‘కరోనా’ నేపథ్యంలో అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా, ఆయా దేశాలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో, ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ తాము ఉద్యోగాలను కోల్పోయిన పక్షంలో నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లే పరిస్థితులు లేవని, కాబట్టి హెచ్-1బీ వీసా కాల పరిమితిని 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ వెబ్ సైట్ ద్వారా తమ విజ్ఞప్తులు పంపుతున్నారు. హెచ్-1బీ వీసా కాలపరిమతిని 180 రోజులకు పెంచాలని కోరుతూ ఇప్పటికే ఇరవై వేల మందికి పైగా సంతకాలు చేశారు.
H-1B Workers
USA
white house
Requests

More Telugu News