Cricket: సెప్టెంబర్లో జరగాల్సిన 'ఆసియా కప్‌' కూడా అనుమానమే!

Asia Cup 2020 in September unlikely over coronavirus pandemic
  • సెప్టెంబర్ లో యూఏఈలో జరగాల్సిన మెగా టోర్నీ
  • ఈ ఏడాది కష్టమే అంటున్న బీసీసీఐ
  • ఆతిథ్య పాకిస్థాన్‌ బోర్డుకు కూడా లేని స్పష్టత
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని టోర్నమెంట్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా క్రికెట్ పూర్తిగా ఆగిపోయింది. పలు ద్వైపాక్షిక సిరీస్‌లు వాయిదా పడగా.. ఐపీఎల్‌ పదమూడో ఎడిషన్‌ నిర్వహణ సందిగ్ధంగా మారింది. ఇప్పుడు క్రికెట్ అభిమానులకు మరింత నిరాశ కలిగించేలా ఆసియా కప్ (టీ20) నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.

యూఏఈ వేదికగా సెప్టెంబర్ లో జరగాల్సిన ఈ మెగా టోర్నీపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది వీటిని నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సిరీస్‌లు వాయిదా పడడం, ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ (ఎఫ్‌ టీ పీ) మొత్తం దెబ్బతిన్న నేపథ్యంలో ఆసియా కప్‌ను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై కూడా స్పష్టత లేదన్నారు.

 ‘ఈ ఏడాది ఆసియా కప్‌ నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ కోసం వెళ్లే ఆసియా జట్లకు ఇది మంచి సన్నాహకంగా  ఉండేది. కానీ, కరోనాతో ఆటలు ఆగిపోయినందున  ఇప్పటికిప్పుడు క్రికెట్ షెడ్యూల్ గురించి మాట్లాడటం కరెక్ట్  కాదు. ఎందుకంటే ఎఫ్‌టీపీ  మొత్తం మారిపోయింది. ఏ దేశాలు మళ్లీ క్రికెట్‌ ను ఎప్పుడు మొదలుపెడతాయో తెలియదు. కొన్ని దేశాల్లో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఆసియాకప్ జరగడం కష్టమే అని చెప్పొచ్చు’ అని బీసీసీఐ అధికారులు అభిప్రాయపడ్డారు.

టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్‌  కూడా ఆసియా కప్‌పై స్పష్టత ఇచ్చే పరిస్థితిలో లేదు. కానీ, ఇప్పుడే ఆశలు వదిలేసుకోమన్న ఆ దేశ క్రికెట్ బోర్డు  ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చిస్తామని తెలిపింది. ఆసియా కప్‌ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌ దక్కించుకున్నా.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ టోర్నీని పాక్‌లో కాకుండా తటస్థ వేదిక అయిన యూఈఏలో నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పుడు కరోనా దెబ్బకు అక్కడ కూడా జరగడం కష్టమే అని చెప్పొచ్చు.
Cricket
asia cup
2020
unlikely
Corona Virus
bcci

More Telugu News