Anushka Sharma: పిల్లల కోసం కాదు.. నచ్చిన కథ దొరకనందునే ఈ విరామం: అనుష్క శర్మ

Took break for good stories not for children says anushka sharma
  • పిల్లల్ని ఎప్పుడు కనాలో నాకు తెలుసన్న కోహ్లీ భార్య
  • డబ్బుల కోసం నచ్చని సినిమాలను ఒప్పుకోనని వ్యాఖ్య
  • మంచి కథ దొరికితే చిత్రం నిర్మిస్తానని వెల్లడి
బాలీవుడ్ నటిగానే కాకుండా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భార్యగా అనుష్క శర్మకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు చేయడంతో పాటు సొంత ఫ్యాషన్ బ్రాండ్‌తో వ్యాపారంలోనూ రాణిస్తోందామె. అలాగే, వీలు చేసుకొని మరీ కోహ్లీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తోంది. అంతే కాదు నిర్మాతగా మారి సినిమాలు కూడా తీస్తోంది. ఇంత బిజీగా ఉండే అనుష్క ఈ మధ్య కొంతకాలం బ్రేక్‌ తీసుకోవాలని నిర్ణయించుకుంది. సినిమాలను కూడా తగ్గించుకోవాలని అనుకుంటోందని సమాచారం. దాంతో పిల్లల్ని కనడానికే అనుష్క ఈ విరామం తీసుకుంటోందని బాలీవుడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఇవన్నీ ఊహాగానాలే అని అనుష్క చెప్పింది.

పిల్లల్ని కనడానికే విరామం తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. కెరీర్ను కొనసాగిస్తూనే ఈ విషయంలో ప్లాన్‌ చేసుకోవచ్చు అని చెప్పింది. తాను తల్లిని కావడానికి ఇంకా సమయం ఉందన్న అనుష్క ఎప్పుడు పిల్లల్ని కనాలనేది తన వ్యక్తిగత విషయం అని స్పష్టం చేసింది. ఇందులో ఇతరులకు ఆసక్తి అవసరం లేదని చెప్పింది.

నచ్చిన కథలు రాకపోవడం వల్లే తాను సినిమాలు తగ్గించానని చెప్పింది. ఇప్పుడు డబ్బుల కోసం తనకు నచ్చని చిత్రాలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మొదటి నుంచి తాను డబ్బు కోసం సినిమాలు చేయలేదని స్పష్టం చేసింది. నటన అంటే తనకు ఇష్టమని, అందుకే సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. దానితో పాటు తనకు మరెన్నో వ్యాపకాలున్నాయని, వాటి కోసం కూడా సమయం కేటాయిస్తున్నానని తెలిపింది. మంచి కథ వస్తే నటించడంతో పాటు సినిమాను నిర్మిస్తానని చెప్పింది. త్వరలో రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని వెల్లడించింది.
Anushka Sharma
Bollywood
break
children

More Telugu News