Uttar Pradesh: కూలీలపై అమానుషానికి పాల్పడిన పోలీస్ డిస్మిస్... ఉన్నతాధికారి క్షమాపణలు!

Uttar Pradesh Police Apology to Migrent Workers
  • యూపీలోని బదౌన్ లో ఘటన
  • కూలీలను మోకాళ్లపై నడిపించిన పోలీసులు
  • విధుల నుంచి తొలగించామన్న నగర పోలీస్ చీఫ్

లాక్ డౌన్ కారణంగా ఉపాధి లభించక స్వస్థలాలకు కాలినడకన బయలుదేరిన కూలీలపై అమానుషంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పిన యూపీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు, ఘటనకు కారకులైన వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించలేదన్న కారణంతో బదౌన్ లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో కొందరు యువకులను మోకాళ్లపై కూర్చోబెట్టి నడిపించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, పోలీసుల చర్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీపుపై బ్యాగులు మోస్తూ, మోకాళ్లపై కూర్చుని, మండుతున్న ఎండలో నేలపై చేతులు ఆనిస్తూ, వీరు వెళ్లాల్సి వచ్చింది.

ఈ వీడియోలో తమ సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని అంగీకరించిన నగర పోలీస్ చీఫ్ ఏకే త్రిపాఠి, తాను క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపారు. వలస కార్మికులను ఇలా నడిపించిన ట్రయినీ కానిస్టేబుల్ ను డిస్మిస్ చేశామని, మరో కానిస్టేబుల్ ప్రమేయంపై విచారణ జరిపిస్తున్నామని అన్నారు. పోలీసులు సంయమనం పాటించి, పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

  • Loading...

More Telugu News