Pawan Kalyan: ‘నో అబ్జెక్షన్’ పత్రాలున్నా ఏపీ సరిహద్దుల్లో ఇబ్బందిపై ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

Pawan Kalyan appeals to AP CM Jagan
  • హాస్టల్స్ మూసివేతపై ఇరు రాష్ట్రాలు ముందే  చర్చిస్తే బాగుండేది
  • ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుని వారిని వారి స్వస్థలాలకు చేర్చాలి
  • వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఎన్ 95 మాస్కులు అందడం లేదు
  • ప్రజలకు నిత్యావసరాల కొరత ఉండకుండా చూడాలి
కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో ఈ నెల 22న జనతా కర్ఫ్యూ అనంతరం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి కొస్తే, చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం హాస్టల్స్ లో ఉంటున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

హాస్టల్స్ ను వెంటనే మూసివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఆయా హాస్టల్స్ మూసివేశారు. దీంతో, ఆయా హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థులు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. హాస్టల్స్ లో ఉండేందుకు , వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది.

ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం..  పోలీస్ శాఖ ద్వారా ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ తీసుకుని ఏపీలోని వారి స్వస్థలాలకు వెళ్లే అవకాశం కల్పించింది. అయితే, ఈ పత్రాలతో బయలుదేరిన వారిని ఏపీ సరిహద్దుల్లో ఆపివేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఈ మూడు అంశాల గురించి ఆలోచించాలని కోరుతూ ట్వీట్ చేశారు. హాస్టల్స్ మూసివేతపై ఇరు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అన్నారు. ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుని వారిని వారి స్వస్థలాలకు చేర్చాలని, అవసరమైన వైద్య పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉండమని సూచించాలని కోరారు. అలా రోడ్డుపై గుంపులుగా వదిలేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయని అన్నారు.

ఏపీలోని ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది అందరికీ ఎన్ 95 మాస్కులు అందడం లేదని వైద్యులు చెబుతున్నారని, వైద్యులను ఇతర సిబ్బందిని రక్షించుకోవడం చాలా అవసరమని, రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్య పెంచాలని ఈ విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రజలకు నిత్యావసరాల కొరత ఉండదని, అన్నీ అందుబాటులోకి తీసుకువస్తామనే భరోసాను ప్రజలకు ప్రభుత్వం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ముంగిటకే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకువెళ్తే రోడ్లపైకి జనాలు రావడం గణనీయంగా తగ్గుతుందని సూచించారు.
Pawan Kalyan
Janasena
Jagan
YSRCP
Corona Virus
Andhra Pradesh

More Telugu News