Nandyal: నంద్యాలలో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు... భరోసా ఇచ్చిన సీఎం కార్యాలయం!

Do not Worry About Telangana Students who are now in andhrapradesh
  • ఇతర రాష్ట్రాల వారు రావద్దు, ఇక్కడి వారు వెళ్లవద్దు
  • ఎవరైనా వస్తే క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లక తప్పదు
  • తెలంగాణ విద్యార్థుల బాగోగులను చూసుకుంటామన్న అధికారులు
ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాసులను రాష్ట్రంలోకి అనుమతించేది లేదని, అలాగే, ఇక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల వారు, తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా అంగీకరించబోమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, ఎవరైనా సరిహద్దులు దాటే ప్రయత్నాలు చేస్తే, చెక్ పోస్టుల వద్దే పరీక్షలు నిర్వహిస్తామని, ఆపై రెండు వారాల పాటు క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సిందేనని వెల్లడించింది.

ఇదే సమయంలో నంద్యాలలో వివిధ పోటీ పరీక్షల నిమిత్తం తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వందలాది మంది ఉండగా, వారందరికీ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలని సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉన్నతాధికారుల నుంచి నంద్యాలలో విద్యార్థులు పడుతున్న అవస్థలపై సమాచారం అందగా, మీడియా చానెళ్ల కారణంగానే ఇటువంటి గందరగోళ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. తాము ఇప్పటికే కర్నూలు కలెక్టర్ తో మాట్లాడామని, అక్కడి తెలంగాణ విద్యార్థుల బాగోగులపై బెంగ వద్దని సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు. అదే సమయంలో హైదరాబాద్ సహా తెలంగాణలో ఉన్న ఏపీ విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలని కోరినట్టు వెల్లడించారు.

కాగా, నంద్యాల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు, హాస్టళ్లలో, అద్దె గదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటుంటారు. కరోనా భయాలతో వీరిని ఇళ్లు, హాస్టళ్లు ఖాళీ చేయమంటున్నారన్న వార్తలు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కార్యాలయం కల్పించుకుంది.
Nandyal
Coaching Centers
Telangana
Students
CMO

More Telugu News