Corona Virus: లాక్‌డౌన్ లో ఆధ్యాత్మిక సమావేశం.. పోలీసులకు కత్తి చూపి బెదిరించిన మహిళ!
- యూపీలో ఘటన
- కరోనా కట్టడికి పోలీసుల చర్యలు
- నిబంధనలు ఉల్లంఘించి సమావేశం ఏర్పాటు చేసిన మహిళ
- పోలీసులు రావడంతో వీరంగం
కరోనాను కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు రోడ్లపై తిరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, పోలీసులపై కొందరు తిరగబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో మెహ్దా పూర్వాలో ఓ మహిళ తన నివాసం వద్ద ఓ ఆధ్యాత్మిక సమావేశం ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా పోలీసులపై మండిపడింది.
దాదాపు వంద మంది అక్కడకు రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అందరూ వెళ్లిపోవాలని లాఠీ చార్జీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో సదరు మహిళ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేస్తామని హెచ్చరించినా వినకుండా వారిపైకి కత్తి చూపించి బెదిరించింది. తాను ఆదిశక్తినని, దమ్ముంటే తనను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించండని సవాలు విసిరింది. దాంతో ఆమెను లాక్కెళ్లి పోలీసు వాహనం ఎక్కించి, తీసుకెళ్లారు.