KCR: రోడ్లపై వారు తప్ప ప్రజాప్రతినిధులు ఒక్కరు కనిపించడం లేదు... ఎందుకని అడుగుతున్నా: సీఎం కేసీఆర్

CM KCR furious over public representatives
  • ప్రజానియంత్రణలో ప్రజాప్రతినిధులు కూడా పాలుపంచుకోవాలన్న కేసీఆర్
  • ప్రజాప్రతినిధులుగా మీకు బాధ్యత లేదా అంటూ ఆగ్రహం
  • పంటలను రైతుల స్వగ్రామాల్లోనే కొనుగోలు చేస్తామని హామీ
తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రజా నియంత్రణ చర్యల్లో కేవలం పోలీసులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారని, ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా కనిపించడంలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారని, వారందరూ ఏమయ్యారని సూటిగా ప్రశ్నించారు.

ప్రజాప్రతినిధులుగా మీకు బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. నూటికినూరు శాతం మీరు రంగంలోకి దిగాల్సిందే అని స్పష్టం చేశారు. హైదరాబాద్ విషయానికొస్తే మూడు పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయని, సిటీ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అందరు శాసనసభ్యులు అందరూ దయచేసి ప్రజానియంత్రణ చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు. సిగ్నళ్లు, కూడళ్ల వద్ద నిలుచుని లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాలని అన్నారు.

రైతుల గురించి చెబుతూ, వరి, మొక్కజొన్న పంటల కొనుగోళ్లను ప్రభుత్వం చేపడుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఎవరూ పట్టణాల్లో ఉన్న మార్కెట్ కమిటీ కేంద్రాలకు రావొద్దని, వాటిని మూసివేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లోనే రైతులకు కూపన్లు ఇచ్చి వారి సొంతూళ్లలోనే కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెంచినవారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మరీ ఇంత దుర్మార్గమా... ప్రపంచమంతా హడలిపోతున్న తరుణంలో డబ్బులు దండుకోవాలని ప్రయత్నిస్తారా? అంటూ మండిపడ్డారు.
KCR
Telangana
GHMC
Public Representatives
Corona Virus
Lockdown

More Telugu News