KCR: షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది: సీఎం కేసీఆర్

CM KCR warns people on breaching lock down regulations
  • అమెరికాలో ఆర్మీని దించారని వెల్లడించిన కేసీఆర్
  • పరిస్థితి అదుపుతప్పితే ఇక్కడా అదే పరిస్థితి తప్పదని హెచ్చరిక
  • ఇది ఒకరితో ఆగేది కాదని వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన పరిస్థితుల్లో తాజా పరిణామాలపై స్పందించారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు పాకిందని వెల్లడించారు. తెలంగాణ విషయానికొస్తే విదేశాల నుంచి వచ్చిన వారు, వారు కలిసిన వారితో కలిపి మొత్తం 19,300 మందిపై నిఘా ఉంచామని వివరించారు.

అయితే, క్వారంటైన్ లో ఉంచిన వ్యక్తులు తప్పించుకుని పోతున్నారని, నిర్మల్ లో ఓ వ్యక్తి అలా మూడుసార్లు తప్పించుకున్నాడని తెలిపారు. 114 మందిని కరోనా అనుమానితులుగా భావిస్తున్నామని, వారికి వైద్యపరీక్షలు నిర్వహించామని, రేపు ఫలితాలు వస్తాయని చెప్పారు.

ఇది ఒక ప్రాంతానికే పరిమితైన సమస్య కాదని, ప్రజలు వందశాతం సహకరిస్తేనే నివారణ సాధ్యమని స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తుండడం పట్ల సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమెరికాలో తాజాగా జరిగిన పరిణామాన్ని మీడియాకు వెల్లడించారు. పరిస్థితిని పోలీసులు అదుపు చేయలేకపోవడంతో ఆర్మీని దించారని, అగ్రరాజ్యంలోనే అలాంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు.

అయితే తెలంగాణలో ప్రజలు పోలీసుల మాట వినకపోతే 24 గంటల కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని, అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ తప్పదని, అయినా పరిస్థితి మారకపోతే సైన్యాన్ని దించకతప్పదని హెచ్చరించారు. ఇలాంటి దుస్థితి మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. కరోనా వ్యాప్తి ఒకరితో ఆగేది కాదని, ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
KCR
Corona Virus
Telangana
Lockdown

More Telugu News