Narendra Modi: లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోండి.. సూచనలు పాటించండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

modi on corona
  • లాక్‌డౌన్‌పై అలక్ష్యం వద్దు
  • ఎందుకు విధించారో అర్థం చేసుకోవాలి
  • ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ అనుభవాలను మర్చిపోవద్దు
  • మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవండి 
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధించిన లాక్‌డౌన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. లాక్‌డౌన్‌పై అలక్ష్యం వద్దని, ఎందుకు విధించారో అర్థం చేసుకోవాలని సూచించారు. దీన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించి ఆచరించాలని పిలుపునిచ్చారు. మన భద్రత కోసమే లాక్‌డౌన్‌ ప్రకటించామని ట్వీట్లు చేశారు.

ప్రతి ఒక్కరూ విధిగా సామాజిక దూరాన్ని పాటించాలని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ నియమాలను కచ్చితంగా అమలు చేయాలని, లాక్‌డౌన్‌పై అలక్ష్యం చేస్తే భవిష్యత్తులో ముప్పు పెరుగుతుందని గుర్తించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని నియమాలను పాటించాలని ఆయన కోరారు.

దేశ క్షేమం కోసం లాక్‌డౌన్‌ పాటించాలని ప్రజలను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని మోదీ తెలిపారు. ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ అనుభవాలను మర్చిపోవద్దని, మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవండని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తించాలని చెప్పారు. చాలా మంది ప్రజలు లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవట్లేదని, లాక్‌డౌన్‌ను తప్పకుండా తీవ్రంగానే పరిగణించి ఎవరిని వారు రక్షించుకోవడంతో పాటు కుటుంబాన్ని రక్షించుకోవాలని చెప్పారు. ప్రభుత్వం చేస్తోన్న సూచనలను తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.
Narendra Modi
BJP
Corona Virus

More Telugu News