Home quarantine: క్వారంటైన్ పూర్తికాకుండానే ప్రయాణాలు మొదలెట్టేసిన బాధితులు.. పోలీసులకు సవాల్!

Police stop People who came from abroad
  • ఖతర్ నుంచి వచ్చిన 37 మంది ఉత్తరాంధ్ర వాసులు
  • క్వారంటైన్ పూర్తికాకుండానే నాగ్‌పూర్ బయలుదేరిన ఏలూరు వ్యక్తి
  • దుబాయ్ నుంచి వచ్చి కాకినాడ వెళ్తున్న మహిళ సికింద్రాబాద్‌లో దించివేత
కరోనా వైరస్ మరింత ప్రబలకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంటే బాధితులు మాత్రం క్వారంటైన్ పూర్తికాకుండానే ప్రయాణాలు మొదలెట్టేశారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు, అధికారులకు తలకు మించిన భారంగా మారింది. నిన్న ఒక్క రోజే వందలాదిమందిని పోలీసులు గుర్తించి మళ్లీ క్వారంటైన్‌కు తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఇటువంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి.

క్వారంటైన్‌లో ఉండాల్సిన కొందరు ఏపీ వాసులు రైలు ప్రయాణం చేస్తుండగా గుర్తించిన అధికారులు వారిని గుర్తించి దించివేశారు. మరో ఘటనలో హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన మహిళను బంధువులు ఇంటికి పంపేశారు. ఖతర్ నుంచి వచ్చిన 37 మంది ఉత్తరాంధ్రవాసులను పోలీసులు గచ్చిబౌలిలోని క్వారంటైన్‌కు తరలించారు. సిడ్నీ నుంచి ఇటీవల ఏలూరు వచ్చిన ఓ వ్యక్తి హోం క్వారంటైన్ పూర్తికాకుండానే కర్ణాటక సంపర్క్‌క్రాంతి రైలెక్కేశాడు. సికింద్రాబాద్ రైల్వే కంట్రోలర్ సమాచారంతో భువనగిరిలో అతడిని దింపిన పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇంకో ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన కాకినాడ మహిళ రైలులో వెళ్తుండగా ఆమె చేతిపై ఉన్న క్వారంటైన్ ముద్ర చూసిన తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వారిచ్చిన సమాచారంతో సికింద్రాబాద్‌లో పోలీసులు ఆమెను దించివేశారు. నైజీరియా నుంచి ఈ నెల 20న ముంబైకి చేరుకున్న యూపీ వ్యక్తిపై అధికారులు క్వారంటైన్ ముద్ర వేశారు. అతడు యూపీ వెళ్లకుండా ముంబై ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ చేరుకున్నాడు. అతడి చేతిపై ఉన్న ముద్ర చూసిన ఇతర ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Home quarantine
Corona Virus
Andhra Pradesh
Telangana

More Telugu News