Ram Gopal Varma: ఆర్జీవీపై బాలీవుడ్ నటి పొగడ్తల వర్షం

  company actress isha koppikar hails ram gopal varma
  • వర్మ  ఓ మేధావి అంటున్న ఇషా కొప్పికర్ 
  • భారత సినీ చరిత్రలో గుర్తుండే చిత్రాలు తీశాడని కితాబు
  • ప్రస్తుతం వర్మ సమర్పిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ఇషా
ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై బాలీవుడ్‌ నటి ఇషా కొప్పికర్ పొగడ్తల వర్షం కురిపించింది. వర్మ మేధావి అని కొనియాడింది. భారత సినీ చరిత్రలో గుర్తుండిపోయే ఎన్నో గొప్ప చిత్రాలను ఆయన తెరకెక్కించారని అభిప్రాయపడింది. అన్ని జోనర్లలోనూ వర్మ అద్భుతమైన సినిమాలు తీశారని చెప్పింది.

 తాను చూసిన మొదటి హారర్ చిత్రం వర్మ తీసిన ‘రాత్‌’ అని తెలిపింది. ‘భూత్‌’, ‘రంగీలా’, ‘సత్య’ వంటి వైవిధ్యమైన సినిమాలను వర్మ తెరకెక్కించారని చెప్పుకొచ్చింది. కాగా, ఈ మధ్య రామ్‌ గోపాల్‌ వర్మ తీస్తున్న సినిమాలు వరుసగా నిరాశ పరుస్తున్నాయి. అయితే, ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయన్న ఇషా.. మనిషి అంతటితో అగిపోయినట్టు కాదని అభిప్రాయపడంది.

2002లో వర్మ తీసిన ‘కంపెనీ’ సినిమాలో ప్రత్యేక గీతంతో ఇషా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆర్జీవీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సిరీస్‌కు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. దీనికి నలుగురు దర్శకత్వం వహిస్తున్నారని ఇషా తెలిపింది. షూటింగ్ మొత్తం పూర్తికాగానే దానికి తుదిమెరుగులు దిద్దే బాధ్యతను వర్మకు అప్పగిస్తారని చెప్పింది. పోస్ట్  ప్రొడక్షన్ పనులను పర్యవేక్షించనున్న వర్మ  ఈ వెబ్‌ సిరీస్‌తో ఓ మ్యాజిక్  క్రియేట్‌ చేస్తారని ఇషా అభిప్రాయపడింది.
Ram Gopal Varma
Bollywood
actress
isha koppiakar
hails rgv

More Telugu News