Visakhapatnam: విశాఖలో హై అలర్ట్... కరోనా తొలి పాజిటివ్ కేసుతో అప్రమత్తమైన అధికారులు

first corono positive case in visakhapatnam
  • అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి వైరస్ 
  • చెస్ట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స
  • అతని నివాస ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు

నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో తొలి పాజిటివ్ కేసు బయటపడడంతో ఏపీ వైద్యశాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి వైరస్ సోకిందని తేలడంతో సిబ్బంది ఆయన నివాసం ఉన్న ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మక్కా వెళ్లిన ఈ వృద్ధుడు వారం క్రితమే తిరిగి వచ్చాడు. మూడు రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో ఛాతి ఆసుపత్రిలో చేరాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా అటువంటి లక్షణాలతోనే రావడంతో వీరి నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కి పంపించారు.

నిన్న అక్కడి నుంచి నివేదిక రాగా వృద్ధుడికి పాజిటివ్ అని తేలింది. దీంతో వృద్ధుడిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో వుంచి చికిత్స అందించడంతోపాటు అతను నివాసం ఉన్న ప్రాంతంలో వైద్యబృందాలు సర్వే చేస్తున్నాయి. ఈ వృద్ధుడు ఈ వారం రోజులపాటు ఎవరెవరిని కలిశాడు? ఎక్కడికి వెళ్లాడు? తదితర అంశాలపై ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వృద్ధుడి నివాస ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఆశవర్కర్లు, వలంటీర్లతో కలిపి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మొత్తం 7,800 ఇళ్లను జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. స్ప్రేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.

Visakhapatnam
allipuram
Corona Virus
first case
makka returned

More Telugu News