IPL: ఐపీఎల్ సంగతి బీసీసీఐ చూసుకుంటుందన్న కేంద్ర మంత్రి

Kiran Rijiju says BCCI will take care about IPL
  • దేశంలో కరోనా విజృంభణ
  • ఐపీఎల్ పోటీలు ఏప్రిల్ 15కి వాయిదా
  • మరోసారి సమీక్ష తర్వాత నిర్ణయం 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్ లో అత్యయిక స్థితి కనిపిస్తోంది. పలు రకాల వ్యవస్థలు కొన్నిరోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ వంటి క్రీడాపోటీలు వాయిదా పడ్డాయి. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఎలాంటి పరిస్థితి అయినా కేంద్రం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉందని, ఐపీఎల్ అయినా అంతేనని స్పష్టం చేశారు. ఐపీఎల్ ప్రారంభంపై ఏప్రిల్ 15 తర్వాత నిర్ణయం ఉంటుందని, అయితే ఐపీఎల్ సంగతి చూసుకోవడానికి బీసీసీఐ ఉందని వెల్లడించారు.

ఐపీఎల్ జరగడం అనేది ఇప్పుడు ముఖ్యం కాదని, ప్రజల ఆరోగ్యమే ఇప్పుడు ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15 తర్వాత అప్పటి పరిస్థితులను సమీక్షించి తాజా నిర్ణయం తీసుకుంటారని, క్రికెట్ ఒలింపిక్ క్రీడ కాదు కాబట్టి ప్రత్యేక సంఘమైన బీసీసీఐ ఐపీఎల్ గురించి సమీక్షిస్తుందని తెలిపారు. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ తాజా సీజన్ కరోనా ఉద్ధృతి కారణంగా ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
IPL
BCCI
Kiran Rijiju
Corona Virus
Postpone
India

More Telugu News