Corona Virus: ఎండలో నిలబడితే కరోనా వంటి వైరస్‌లు చచ్చిపోతాయి: కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి
- ప్రజలు 15 నిమిషాల పాటు ఎండలో నిలబడాలి
- దీంతో డీ విటమిన్ వస్తుంది
- వ్యాధి నిరోధకత పెరుగుతుంది
'కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జాగ్రతలు' అంటూ బీజేపీ నేతలు చేస్తోన్న పలు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కొందరు బీజేపీ నేతలు కరోనాను అరికట్టాలంటే గో మూత్రం, పేడ, సూర్యరశ్మి చక్కగా పనిచేస్తాయని వ్యాఖ్యలు చేయగా తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ రోజు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ కరోనాను అరికట్టడానికి పలు సూచనలు చేసి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. 'ప్రజలు 15 నిమిషాల పాటు ఎండలో నిలబడాలి. దీంతో డీ విటమిన్ వస్తుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది.. కరోనా వంటి వైరస్‌లను చంపేస్తుంది' అని చెప్పుకొచ్చారు. 'మీరు ఏ చదువులు చదివారో చెబుతారా?' అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. 'ఈ రోజు ప్రధాని జాతినుద్దేశించి ఇవ్వనున్న సందేశంలోనూ ఈ అంశం ఉంటుందేమో!' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఎండలో నిలబడితే వైరస్‌లన్నీ చచ్చిపోతే ఇటలీలో ఇదే పని చేసేవారుగా?' అని మరొకరు ప్రశ్నించారు.