Chandrababu: పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చాలన్న జగన్ కు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే: చంద్రబాబు సెటైర్లు
- ‘కరోనా’ రాకుండా పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చాలంటారా!
- జగన్ మోహన్ రెడ్డిగా ఆయన అజ్ఞానం అర్థంచేసుకోవచ్చు
- కానీ, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారా?
కరోనా వైరస్ గురించి ప్రస్తావిస్తూ సీఎం జగన్ ఎంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ దరిచేరకుండా ఉండాలంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుని, పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే చాలంటూ వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిగా ఆయన అజ్ఞానం గురించి అర్థం చేసుకోగల్గుతాం కానీ, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని విమర్శించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయని, దీని వల్ల ఏపీలోని అధికారులు, డాక్టర్ల పరువు పోయిందని అన్నారు.
‘కరోనా’ నివారణకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ ను వాడి చూశారా? పని చేశాయా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా అవి పని చేస్తే కనుక యావత్తు ప్రపంచానికి చెబితే, అందరూ ఉపయోగించుకుంటారని, ‘నీకు నోబెల్ ప్రైజ్ కూడా వస్తుంది’ అంటూ జగన్ పై సెటైర్లు విసిరారు.ఏదో పొరపాటున తాను మాట్లాడానని జగన్ చెప్పకపోగా, సమర్థించుకుంటున్నారని విమర్శించారు.