Britain: బ్రిటన్ మహారాణికీ తప్పని కరోనా పోటు!

Queen Elizabeth II shifted out of Buckingham Palace to Windsor Castle
  • ప్రపంచవ్యాప్తంగా కరోనా ఘంటికలు
  • బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి క్వీన్ ఎలిజబెత్-2 తరలింపు
  • బకింగ్ హామ్ ప్యాలెస్ కు నిత్యం వందల్లో సందర్శకులు
  • కరోనా వ్యాపిస్తుందన్న ఆందోళనలు
  • విండ్సర్ క్యాజిల్ కు రాణి గారి మకాం మార్పు
కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. రాణి గారి అధికారిక నివాసం బకింగ్ హామ్ ప్యాలెస్ నిత్యం సందర్శకుల తాకిడితో కోలాహలంగా ఉంటుంది. దాంతో కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకుటుంబం భావిస్తోంది. అందుకే మహారాణి క్వీన్ ఎలిజబెత్-2తో పాటు యువరాజ్ ఫిలిప్ ను కూడా బెర్క్ షైర్ లోని రాజవిడిది విండ్సర్ క్యాజిల్ కు తరలించారు.

ప్రస్తుతం మహారాణి ఆరోగ్యం భేషుగ్గానే ఉందని, అయితే ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఆమెను తరలించడమే అత్యుత్తమ నిర్ణయం అని భావిస్తున్నామని రాజకుటుంబ వర్గాలు తెలిపాయి. బకింగ్ హామ్ ప్యాలెస్ కు ప్రపంచం నలుమూలల నుంచి రాజకీయవేత్తలు, ఇతర ప్రముఖులు వస్తుంటారని, ఇటీవల వరకు మహారాణి నిత్యం అనేకమందిని కలుస్తుండేవారని, ఈ నేపథ్యంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆమెను తరలించకతప్పలేదని ఓ రాజకుటుంబ సన్నిహితుడు పేర్కొన్నారు. పైగా, బకింగ్ హామ్ ప్యాలెస్ లో సిబ్బంది కూడా ఎక్కువేనని, ఇది కూడా ఓ కారణమని తెలిపారు.

ప్రస్తుతం బకింగ్ హామ్ ప్యాలెస్ లో 500 మందికి పైగా సిబ్బంది విధలు నిర్వర్తిస్తున్నారు. ఇంతమంది నడుమ కరోనా వ్యాప్తిని నియంత్రించడం కొంచెం కష్టసాధ్యమైన పని కావడంతో తక్కువ సిబ్బంది ఉండే విండ్సర్ కోటకు రాణి గారి మకాం మార్చుతున్నారు. కాగా, బకింగ్ హామ్ ప్యాలెస్ లో మహారాణి నిర్వహించే దర్బారును సైతం విండ్సర్ క్యాజిల్ లో నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Britain
Queen Elizabeth-2
Buckingham Palace
Windor Castle
Corona Virus

More Telugu News