Chandrababu: ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు సీఎం జగన్ కు లేదు: చంద్రబాబు
- ‘కరోనా’పై జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి
- ఈ వైరస్ తో ఏం ప్రమాదం లేదన్నట్టు మాట్లాడతారా?
- ఈ వ్యాఖ్యలను వెంటనే జగన్ వెనక్కి తీసుకోవాలి
కరోనా వైరస్ సాకుతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదావేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేశ్ కుమార్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సీఎం జగన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు స్పందిస్తూ, జగన్ వ్యాఖ్యలు ఎంతో బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు.
‘కరోనా’ను డిజాస్టర్ గా ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఇప్పటికే ప్రకటించిందని, ఈ వైరస్ రెండు వారాల్లో 13 రెట్లు పెరిగిందని నిపుణులే చెబుతున్నారని అన్నారు. ‘కరోనా’ను నోటిఫైడ్ విపత్తుగా ప్రధాని మోదీ నిన్ననే ప్రకటించారని, ఈ వైరస్ ఏపీలో వ్యాపిస్తే రాష్ట్రం ఏమైపోతుంది? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు సీఎం కు లేదని స్పష్టం చేశారు. అధికార దాహంతో ఉన్న జగన్ కు ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదని, ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలు ముఖ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
‘కరోనా’ నిరోధానికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ చెప్పలేకపోయారని విమర్శించారు. ప్రపంచాన్ని గడగడ లాడించినా ‘కరోనా’ పై అవగాహన లేకుండా మాట్లాడారని, ఏం ప్రమాదం లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లండన్ లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు కూడా వాయిదా వేశారని గుర్తుచేశారు.