tokyo: ఒలింపిక్స్​ ఆగవు.. షెడ్యూల్​ ప్రకారమే జరుగుతాయి: జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి

Japan says Olympics on track despite Donald Trump suggestion
  • వాయిదా వేసే ఉద్దేశం లేదు
  • స్పష్టం చేసిన జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి
  • జపాన్ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌
కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నప్పటికీ.. షెడ్యూల్ ప్రకారమే విశ్వక్రీడలను మొదలు పెట్టాలని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మెగా ఈవెంట్‌ను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని చెబుతున్నా.. తమకు ఆ ఉద్దేశమే లేదని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యొషిహిడే సుగా శుక్రవారం స్పష్టం చేశారు.

‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏం మాట్లాడారో నాకు తెలుసు. అయితే, ఒలింపిక్స్ ను ప్రణాళిక ప్రకారం నిర్వహించేందుకు మేం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో కలిసి పని చేస్తున్నాం’అని ప్రకటించారు.

 కరోనా ప్రభావం దృష్ట్యా ఒలింపిక్స్‌ను ఒక ఏడాది పాటు వాయిదా వేయాలని ట్రంప్‌ సూచించిన సంగతి తెలిసిందే. జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబేతో శుక్రవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. అయితే, టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా గురించి గానీ, ప్రేక్షకులను అనుమతించకుండా క్రీడలను నిర్వహించాలని గానీ ఇద్దరు నేతల మధ్య చర్చ జరగలేదని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి నవొకి ఒకాడ తెలిపారు.

కరోనా వైరస్‌పై యుద్ధంలో గెలిచి, ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించాలని తమ ప్రధాని దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ఈ విషయం గురించి తాను కూడా ఆలోచిస్తానని ట్రంప్ అన్నారని తెలిపారు. జపాన్‌, అమెరికా మధ్య ప్రయాణ ఆంక్షల గురించి కూడా ట్రంప్‌, షింజో చర్చించలేదని పేర్కొన్నారు.
tokyo
olympics
Donald Trump
Japan

More Telugu News