China: 'కోవిడ్-19' అంతం ఎలాగో చెప్పిన చైనా.. కలసి పోరాడితే జూన్ నాటికి మాయమవుతుందన్న డ్రాగన్ కంట్రీ!

  • హుబేయిలో ఇప్పుడు సింగిల్ డిజిట్‌కు పడిపోయిన కొత్త కేసుల సంఖ్య
  • ఇతర నగరాలకు వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు
  •  ప్రపంచ దేశాలు తమను ఆదర్శంగా తీసుకోవాలన్న అధికారులు
Covid 19 ends after june of countries implement WHO Suggestions

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారిని ఈ భూమ్మీది నుంచి వెళ్లగొట్టడం ఎలానో చైనా సీనియర్ మెడికల్ అడ్వైజర్ ఒకరు తెలిపారు. ఆ దేశంలోని హుబేయి ప్రావిన్స్‌లో తొలిసారి వెలుగుచూసిన కరోనా వైరస్.. ఆ తర్వాత ప్రపంచానికి పాకింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కోవిడ్ కేసుల్లో మూడింట రెండొంతులు చైనాలోనే నమోదయ్యాయి. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు హుబేయి ప్రావిన్స్‌లో కొత్త కేసుల నమోదు క్రమంగా సింగిల్ డిజిట్‌కు తగ్గింది.

వైరస్ వెలుగుచూసిన వెంటనే ప్రభుత్వం హుబేయిని దిగ్బంధించింది. ప్రయాణ ఆంక్షలు విధించి వైరస్ ఇతర నగరాలకు విస్తరించకుండా జాగ్రత్త పడింది. అధికారుల కృషి ఫలించింది. ప్రస్తుతం ఇక్కడ కొత్త కేసుల నమోదు గణనీయంగా పడిపోయింది. తాజాగా ఈ విషయమై ఆ దేశ సీనియర్ మెడికల్ అడ్వైజర్ ఝెంగ్ నాన్షన్ మాట్లాడుతూ.. కోవిడ్-19 ను తీవ్రంగా పరిగణించి, దాని కట్టడికి కలసికట్టుగా చర్యలు తీసుకునే వరకు వైరస్ వ్యాపిస్తూనే ఉంటుందన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనలను అన్ని దేశాలు పాటించాలని, దేశాలన్నీ కలసి పోరాడితే జూన్ తర్వాత ఈ వైరస్ అంతమవుతుందని ఆయన వివరించారు. ఇదొక అంటువ్యాధి మాత్రమేనని, చైనాలో తీవ్ర రూపం దాల్చిన ఈ వైరస్ ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికార ప్రతినిధి మి ఫెంగ్ అన్నారు. వైరస్‌ను అరికట్టే విషయంలో ఇతర దేశాలు చైనాను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

More Telugu News