Kadapa District: రోడ్డు ప్రమాదంలో స్కార్పియో డ్రైవర్ సజీవ దహనం

One feared dead in road accident in Kadapa dist
  • కడప జిల్లా సిద్ధవటం మండలంలో ఘటన
  • కర్నూలు నుంచి వాహనంలో తిరుపతి వెళ్తుండగా ప్రమాదం
  • అతి వేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
కడప జిల్లా సిద్ధవటం మండలంలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఓ వాహన డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా బాలంపురం గ్రామానికి చెందిన కొందరు స్కార్పియో వాహనంలో తిరుపతికి బయలుదేరారు. సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లెకు చేరుకోగానే స్కార్పియో-లారీ ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. ఆ వెంటనే మంటలు చెలరేగడంతో స్కార్పియో డ్రైవర్ బండి ఆది సజీవ దహనమయ్యాడు.

ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే 108 అంబులెన్స్‌లో కడపలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను సుల్తాన్ (28), హరినాథ్‌రెడ్డి (36), నందకిశోర్‌రెడ్డి (6), పార్వతి (30), శంకర్‌నారాయణరెడ్డి (55), జయమ్మ (55), కృష్ణ కిశోర్‌రెడ్డి (29)గా గుర్తించారు. గాయపడిన వారిలో ఓ బాలిక కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
Kadapa District
Road Accident
Andhra Pradesh

More Telugu News