Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​.. ఆయన ప్రొఫైల్​ ఇదిగో!

Karimnagar MP Bandi Sanjay appoints as BJP Telangana Chief
  • కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ అధిష్ఠానం
  • ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పనిచేసిన సంజయ్
  • టీఆర్ఎస్ సీనియర్ వినోద్ ను ఓడించి వెలుగులోకి..
  • ఆర్టీసీ సమ్మె సమయంలో చురుగ్గా ఆందోళనల్లో పాల్గొన్న తీరు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు బండి సంజయ్ ఎంపికను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఖరారు చేసినట్టుగా పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె.లక్ష్మణ్ నే మరోసారి కొనసాగిస్తారని భావించారు. కానీ బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్ వైపు మొగ్గు చూపింది.

చాలా సింపుల్ గా ఉంటూ.. 

కరీంనగర్ లో క్షేత్ర స్థాయి నుంచి ఎదిగిన నేత బండి సంజయ్. ఆయన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల్లో పనిచేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలుమార్లు కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కరీంనగర్ నుంచే రెండు సార్లు అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే రెండు సార్లూ గట్టి పోటీ ఇచ్చి అందరి దృష్టిలో పడ్డారు. అయితే ఎప్పుడూ ఆయన హడావుడి చేయడంగానీ, దర్పం ప్రదర్శించడం గానీ చేయకుండా, సింపుల్ గా ఉంటారన్న పేరుంది.

జెయింట్ కిల్లర్ గా..

ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం గత లోక్ సభ ఎలక్షన్లలో ఆయనకు కరీంనగర్ లోక్ సభ టికెట్ ఇచ్చింది. అక్కడి నుంచి గతంలో ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్, తాజామాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ బంధువు వినోద్ టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. అయినా బండి సంజయ్ విస్తృతంగా తిరిగి, ప్రజలను కలిశారు. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై ఏకంగా 90 వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలిచి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.

పోరాటాలు, ఆందోళనల్లో యాక్టివ్..

బండి సంజయ్ కొంతకాలంగా రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఇంటర్ విద్యార్థుల ఫలితాల గందరగోళం సమయంలో, తర్వాత ఆర్టీసీ సమ్మె సమయంలో ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో అందరి దృష్టీ ఆయనపై పడింది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బండి సంజయ్ తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు కూడా పోటీ పడ్డారు. మరికొందరూ ప్రయత్నించారు. చివరికి బండి సంజయ్ ను పదవి వరించింది.

బండి సంజయ్ ప్రొఫైల్ ఇదీ..

  • పూర్తి పేరు: బండి సంజయ్ కుమార్

  • పుట్టిన తేదీ: 1971 జూలై 11

  • బీసీ వర్గానికి చెందిన సంజయ్ భార్య అపర్ణ స్టేట్ బ్యాంకు ఉద్యోగి. వారికి ఇద్దరు పిల్లలు సాయి భగీరత్, సాయి సుముఖ్

  • చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు.

  • ఏబీవీపీ కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షుడిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు.

  • కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు సార్లు డైరెక్టర్ గా పనిచేశారు.

  • భారతీయ జనతా యువమోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. మోర్చాకు కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించారు.

  • అద్వానీ రథయాత్రలో కొంతకాలం వెహికల్ ఇంచార్జిగా ఉన్నారు.

  • కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మూడు సార్లు కార్పొరేటర్ గా గెలిచారు.

  • 2014, 2018 అసెంబ్లీ ఎలక్షన్లలో కరీంనగర్ సెగ్మెంట్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.

  • 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా ఘనవిజయం సాధించారు.

Bandi Sanjay
BJP
Telangana
MP Bandi sanjay
JP Nadda

More Telugu News