Nizamabad District: వివాహిత ఆత్మహత్య.. కారంపొడి, కర్రలతో బాధిత కుటుంబ సభ్యుల వీరంగం

woman relatives attack on police in Nizamabad
  • నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఘటన
  • వాహనాల్లో దాడికి బయలుదేరిన 200 మంది మహిళలు
  • అడ్డుకున్న పోలీసులపైనా దాడి
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఓ వివాహిత ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కర్రలు, కారంపొడితో బాధిత కుటుంబ సభ్యులు వీరంగమేశారు. అడ్డొచ్చిన పోలీసులపైనా దాడికి యత్నించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని డీబీ తండాకు చెందిన మంజుల (22), గుట్టకింది తండాకు చెందిన లావుడ్య గణేశ్ భార్యాభర్తలు. మూడేళ్ల క్రితం వీరికి వివాహం కాగా, మంజుల ప్రవర్తన బాగా లేకపోవడంతో వారం రోజుల క్రితం భర్త ఆమెను మందలించాడు. దీంతో కలత చెందిన మంజుల ఎవరికీ చెప్పకుండా తిరుపతి వెళ్లింది. మంజుల కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఈ నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈలోగా తిరుపతి నుంచి మంజుల భర్త మిత్రుడు గోపాల్‌తో మాట్లాడింది. దీంతో ఆ ఫోన్ కాల్ ద్వారా ఆమె తిరుపతిలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే, అప్పటికే ఆమె డీబీ తండాకు చేరుకుంది. తండాకు వచ్చినప్పటికీ ఇంటికి వెళ్లని ఆమె పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచింది.

మంజుల ఆత్మహత్యకు గణేశ్ కారణమని భావించిన బాధిత కుటుంబ సభ్యులు, బంధువులైన 200 మంది మహిళలు వాహనాల్లో డీబీతండాకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మార్గమధ్యంలోనే కాపుకాసి అడ్డుకున్నారు. దీంతో వాహనాలు దిగిన మహిళలు కారంపొడి, కర్రలు పట్టుకుని కాలినడకన తండాకు బయలుదేరారు.

పోలీసులను పక్కకు నెట్టేసి గణేశ్, గోపాల్ ఇళ్లపై కారంపొడి, కర్రలతో దాడికి దిగారు. ఫర్నిచర్, తలుపులను ధ్వంసం చేశారు. వారిని అదుపు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపైనా వారు దాడికి దిగడంతో అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మంజుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేశారు. గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిపైనా  కేసులు నమోదు చేశారు.
Nizamabad District
Darpalli
suicide
Crime News

More Telugu News