Iran: ఇరాన్ నుంచి 58 మంది భారతీయులతో హిండోన్‌లో ల్యాండ్ అయిన వాయుసేన విమానం

58 Indians Evacuated From Virus Hit Iran
  • కేంద్ర మంత్రి జయశంకర్ ట్వీట్ చేసిన కాసేపటికే ల్యాండ్ అయిన విమానం
  • ఇరాన్‌లోని భారత రాయబార, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు
  • క్వామ్ నగరంలో చిక్కుకున్న 40 మంది కోసం ఢిల్లీ నుంచి వైద్య బృందం
కరోనా వైరస్‌తో అల్లాడుతున్న ఇరాన్‌లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను భారత వాయుసేన రక్షించింది. వారి కోసం వెళ్లిన ప్రత్యేక విమానం మరికొద్ది సేపట్లో భారత్‌లో ల్యాండ్ అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.

 టెహ్రాన్‌లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయుల కోసం వెళ్లిన వాయుసేన విమానం సి-17 వారిని వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అయిన హిండోన్‌కు తీసుకురాబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే విమానం హిండోన్‌లో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు, వైద్య సిబ్బందికి జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
 
చైనా తర్వాత కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్నది ఇరాన్‌లోనే. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వందలాదిమంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్రం వారిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. తొలి విడతగా 58 మందిని అక్కడి నుంచి తరలించినట్టు మంత్రి పేర్కొన్నారు.  

ఇరాన్‌లో ఇప్పటి వరకు 230 మంది కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మూడువేల మంది ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. ఒక్క రాజధాని టెహ్రాన్‌లోనే 1945 కేసులు నమోదు కావడం గమనార్హం. కాగా, ఇరాన్‌లోని క్వామ్ నగరంలో ఉన్న మరో 40 మంది భారతీయులకు వైద్యసాయం అందించేందుకు ఢిల్లీ నుంచి వైద్యుల ప్రత్యేక బృందాన్ని భారత్ పంపింది.
Iran
Corona Virus
Indians
Tehran
Jaishankar

More Telugu News