Tamil Passengers: క్రూయిజ్ షిప్ లో 17 మంది తమిళులు.. షిప్ లో ఉన్నవారిలో 33 మందికి కరోనా పాజిటివ్!

17 Tamil passengers stuck on ship over corona virus
  • తమిళనాడు నుంచి ఫిబ్రవరి 27న టూర్ కు బయల్దేరిన తమిళులు
  • ఈజిప్టులోని నైలు నదిలో క్రూయిజ్ షిప్ నిలిపివేత
  • కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఆసుపత్రికి తరలింపు
ఈజిప్టులోని లక్సర్ నగరంలో నైలు నదిలో 'ఏ సారా' అనే క్రూయిజ్ షిప్ ను ఆపేశారు. ఈ షిప్ లో 17 మంది భారతీయులు ఉండగా... వీరంతా తమిళులు. షిప్ లో ఉన్నవారిలో 12 మంది క్రూ సిబ్బందితో పాటు మరో 33 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్ అని టెస్టుల్లో తేలింది. కరోనా బారిన పడ్డ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని పోర్ట్ సిటీ అయిన అలెగ్జాండ్రియాలో ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. షిప్ లో ఉన్న అందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తున్నట్టు క్రూ సిబ్బంది ప్రకటించారు.

క్రూయిజ్ షిప్ లక్సర్ కు చేరుకోగానే అందరికీ స్క్రీనింగ్ నిర్వహించారు. టెస్టుల్లో పాజిటివ్ గా తేలిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. షిప్ లో ఉన్నవారిలో వనితా రంగరాజ్, ఆమె భర్త ఆర్.రంగరాజ్ కూడా ఉన్నారు. వీరు తమిళనాడులో ఒక అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఫోన్ ద్వారా వనితా రంగరాజ్ మాట్లాడుతూ, పూర్తి వివరాలను వెల్లడించారు.

'ఫిబ్రవరి 27న తమిళనాడుకు చెందిన 18 మంది బయల్దేరాం. షెడ్యూల్ ప్రకారం మార్చ్ 7న తిరిగి రావాల్సి ఉంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లకు పైబడినవారే. గత శుక్రవారం నుంచి షిప్ లో ఉన్నవారందరినీ నిర్బంధించారు. కేటాయించిన గదుల్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని ఆదేశించారు. క్రమం తప్పకుండా చేతులను కడుక్కోవాలని, మాస్కులను ధరించాలని సూచించారు.

మాకు నిర్ణీత సమయానికి ఆహారాన్ని ఇవ్వడం లేదు. మా ఇబ్బందులను కుటుంబ సభ్యులకు తెలియజేశాం. వారు ఈజిప్టులోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు.

మాకు శాకాహార భోజనాన్ని ఇవ్వాలని క్రూ సిబ్బందిని కోరాం. కరోనా నేపథ్యంలో షిప్ లోని కిచెన్ ను స్టెరిలైజ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా వంటగదిని మూసేశారు. ఆహారాన్ని బయట నుంచే తెప్పిస్తున్నారు.

సేలంలోని గ్రాండ్ రాయల్ టూర్స్ ఆపరేటర్ ద్వారా తాము క్రూయిజ్ షిప్ లో టూర్ కు వచ్చాం. ప్యాకేజీలో భాగంగా నైల్ క్రూయిజ్ కూడా ఉంది. పర్యటనలో భాగంగా అద్భుతమైన ప్రదేశాలను సందర్శించాం. ఇండియా నుంచి బయల్దేరే ముందు కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని టూర్ ఆపరేటర్ చెప్పాడు. క్రిటికల్ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో షిప్ లోని క్రూ సిబ్బంది వివరించారు. పూర్తి స్థాయిలో మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. షిప్ లోనే చిన్న సైజు హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. అయితే, ఇతర ప్రయాణికుల మాదిరే క్రూ సిబ్బంది కూడా ఇప్పుడు తీవ్ర భయాందోళన చెందుతున్నారు' అని వనితా రంగరాజ్ తెలిపారు.

మరోవైపు వనిత కుమర్తె శరణ్య రంగరాజ్ మాట్లాడుతూ, ఈజిప్టులోని ఇండియన్ ఎంబసీని సంప్రదించామని తెలిపారు. క్రూయిజ్ లో నిర్బంధంలో ఉన్న 18 మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకొస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Tamil Passengers
Cruise Ship
Egypt
Luxor City
Nile River
Corona Virus
A Sara Cruise

More Telugu News