T20 World Cup: ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది: స్మృతి మంధాన

Team needs to be left alone and it is time to introspect says Smriti Mandana
  • జట్టును కొంత సమయం ఒంటరిగా వదిలేయండి
  • భవిష్యత్‌లో ఎలా మెరుగవ్వాలో మేం ఆలోచించుకోవాలి
  • టోర్నీలో షెఫాలీ గొప్పగా ఆడిందని కితాబు
టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపై భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన స్పందించింది. కొంతకాలం తమ జట్టును ఒంటరిగా వదిలేయాలని అందరిని కోరింది. ‘ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. విజయాలకంటే ఓటములే మనకు మరిన్ని పాఠాలు నేర్పిస్తాయి. ఇప్పుడందరూ జట్టును ఒంటరిగా వదిలేయాలి. రాబోయే కాలంలో ఎలా మెరుగవ్వాలో మేం ఆలోచించాలి’ అని తెలిపింది.

టీ20 ఫార్మాట్‌లో ఇదివరకు తమకు మంచి రికార్డు లేదని మంధాన చెప్పింది. వన్డేలే తమ బలమని, అయితే, డబ్ల్యూవీ రామన్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టంతా కలిసికట్టుగా రాణిస్తోందని తెలిపింది. ఇప్పుడు వన్డేలతో పాటు టీ20ల్లో కూడా బాగా ఆడుతున్నామని, దీనికి రామన్ చేసిన కృషే కారణమన్నది. ఫైనల్ జరిగిన ఒక్క రోజు సరిగ్గా ఆడకపోయినా పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా మెరుగైన స్థాయికి చేరుకున్నదని పేర్కొన్నది.

షెఫాలీ గర్వపడాలి 

ఫైనల్లో తక్కువ పరుగులకే ఔటైన యువ ఓపెనర్ షెఫాలీ వర్మ మ్యాచ్ అనంతరం తీవ్రంగా మనస్తాపం చెంది కన్నీళ్లు పెట్టుకుందని మంధాన చెప్పింది. అయితే, ఈ మ్యాచ్ మినహాయిస్తే మిగతా టోర్నీలో ఆమె చాలా గొప్పగా ఆడిందని, దానికి ఆమె గర్వపడాలని అభిప్రాయపడింది. తాము తొలిసారి వరల్డ్ కప్‌లో పాల్గొన్నప్పుడు షెఫాలీలో 20 శాతం ఆట కూడా ఆడలేదని చెప్పుకొచ్చింది.
T20 World Cup
smriti madhana
Team India
final
loss

More Telugu News