Devineni Uma: చాలా చోట్ల ఎంపీటీసీల్లో బీసీ మహిళలు లేరు... ఇది కుట్ర కాదా?: దేవినేని ఉమ

Devineni Uma questions YSRCP government over BC reservations
  • ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు
  • బడుగు, బలహీన వర్గాల వారి గొంతునొక్కుతున్నారంటూ ఉమ ఆగ్రహం
  • అధికారులు తప్పు చేస్తున్నారంటూ విమర్శలు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారవడం పట్ల టీడీపీ నేతలు స్పందించారు. సీనియర్ నేత దేవినేని ఉమ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలు ఎంపీటీసీలుగా లేని చోట బీసీలకు రిజర్వ్ చేయడం కుట్ర అని అరోపించారు. "కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం బీసీ మహిళకు రిజర్వ్ అయింది కానీ ఎంపీటీసీ బీసీ మహిళ లేదు. నెల్లూరు జిల్లాలో 16 మండలాల్లో ఒక్క ఎంపీటీసీ కూడా బీసీ లేరు. కృష్ణా జిల్లాలో 6 మండలాల్లో 3 మండలాలకు బీసీ పురుషులు లేరు, 3 మండలాలకు బీసీ మహిళలు లేరు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో 30 ఎంపీటీసీల్లో ఒక్క బీసీ సోదరుడు కానీ ఒక్క బీసీ సోదరి కానీ లేరు. దీన్నిబట్టి అర్థమవుతోంది ఏమంటే... కొంతమంది నాయకుల కనుసన్నల్లో అధికారులు తప్పు చేశారు.

ఒక్క చాన్స్ అంటూ అధికారం అందుకుని, జగన్ బడుగు, బలహీన వర్గాల వారి గొంతునొక్కే కార్యక్రమం చేస్తున్నారు. తన నవరత్నాలు, తన 10 నెలల పాలన గెలిపిస్తుందని జగన్ చెప్పడంలేదు. మీమీ ప్రాంతాల్లో ఓడితే నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామాలు చేయండని మంత్రులకు సుభాషితాలు చెబుతున్నారు. దీని ద్వారా వైసీపీ వాళ్లు ఓటమిని ఒప్పుకున్నట్టయింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. దీనిపై జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి" అంటూ వ్యాఖ్యానించారు.
Devineni Uma
Local Body Polls
Reservations
BC
Telugudesam
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News