Corona Virus: కరోనాపై స్మార్ట్​ హెల్మెట్లతో చైనా నిఘా.. దూరం నుంచే మనుషుల టెంపరేచర్లు గుర్తించే ఇన్ ఫ్రారెడ్​ సెన్సర్లు!

  • వీడియో పోస్టు చేసిన చైనా అధికార పత్రిక పీపుల్స్ డైలీ
  • సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో
  • భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
police officers in china wear smart helmets to fight Corona virus

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులను, అనుమానితులను గుర్తించేందుకు చైనా సరికొత్తగా నిఘా పెడుతోంది. చైనా పోలీసులకు స్మార్ట్ హెల్మెట్లను అందజేసింది. శక్తిమంతమైన ఇన్ ఫ్రారెడ్  సెన్సర్లు, కెమెరా ఉన్న ఈ హెల్మెట్లు.. దూరం నుంచే మనుషుల శరీర ఉష్ణోగ్రతలను గుర్తించగలవు. ఆ హెల్మెట్లు పెట్టుకున్న పోలీసులు జస్ట్ అలా వీధుల్లో నిలబడి అందరినీ పరిశీలిస్తుంటారు. అదే సమయంలో హెల్మెట్ స్క్రీన్ పై మనుషుల శరీర ఉష్ణోగ్రతలు ఆటోమేటిగ్గా కనిపిస్తుంటాయి. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక పీపుల్స్ డైలీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పోస్టు చేసింది.

టెంపరేచర్ ఎక్కువగా ఉంటే అలారం

శక్తిమంతమైన ఇన్ ఫ్రారెడ్ కెమెరా ఉన్న హెల్మెట్లు ఎప్పటికప్పుడు వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను ఐదు మీటర్ల దూరం నుంచే గుర్తిస్తాయి. ఎవరికైనా నిర్ణీత ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటే.. వెంటనే అలారం మోగించి హెచ్చరిస్తాయి. పోలీసులు వారి దగ్గరికి వెళ్లి పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. ఇదేదో చాలా బాగుంటుందంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. ఇక అంతా ప్రభుత్వ కంట్రోల్లోకి వెళ్లిపోయినట్టే అని మరికొందరు అంటున్నారు. ఇక స్టార్ వార్స్ సినిమాల్లోని ప్రిడేటర్ల (ఏలియన్ల) హెల్మెట్లను చైనా తయారు చేసేసిందంటూ కామెంట్లు పడుతున్నాయి.

మన దగ్గరా ఇదే తరహా టెస్టింగ్

ఒక్క చైనాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ఇన్ ఫ్రారెడ్ సెన్సర్లు ఉన్న పరికరాలను వాడుతున్నారు. విమానాశ్రయాల్లో తల దగ్గర చిన్న పరికరం ఉంచి టెస్టింగ్ చేయడం మనం వీడియోల్లో చూస్తూనే ఉన్నాం. అయితే అవి కేవలం కొద్ది సెంటీమీటర్ల దూరం నుంచే టెంపరేచర్ ను గుర్తిస్తాయి. ప్రస్తుతం చైనా తయారు చేసిన హెల్మెట్లు ఐదారు మీటర్ల దూరం నుంచే స్కాన్ చేస్తున్నాయి.

ఆర్మీ దగ్గర ఇలాంటి హెల్మెట్లు

ఇన్ ఫ్రారెడ్ తరహా హెల్మెట్లు ఇప్పటికే చాలా దేశాల సైనిక దళాల దగ్గర ఉన్నాయి. అవి దూరం నుంచే వేడిగా ఉన్న వస్తువులను గుర్తించగలవు. అడవుల్లో, యుద్ధం జరిగే ప్రాంతాల్లో, చీకటి సమయాల్లో శత్రువులను, జంతువులను గుర్తించేందుకు ఇన్ ఫ్రారెడ్ ఉన్న పరికరాలు వాడుతుంటారు. మనుషులు, జంతువుల శరీరాలు వేడిగా ఉండటమే దీనికి కారణం. అయితే ఆ పరికరాలు టెంపరేచర్లను కచ్చితంగా అంచనా వేయలేవు.

More Telugu News