Chandrababu: ఈ దుర్ఘటనలు నన్ను తీవ్రంగా కలచివేశాయి: చంద్రబాబునాయుడు

Chandra babu naidu fires on YSRCP Government
  • భూమిని కన్నతల్లి కన్నా మిన్నగా రైతులు భావిస్తారు
  • భూమి లాక్కోవడమంటే బిడ్డ నుంచి తల్లిని దూరం చేయడమే
  • కర్నూలు, శ్రీకాకుళం, గుంటూరులో ఈరోజు జరిగిన ఘటనలు దారుణం
ఏపీ ప్రభుత్వం తీరును టీడీపీ అధినేత చంద్రబాబు ఎండగట్టారు. ఇళ్ల స్థలాల పేరుతో నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అసైన్డ్ భూములు లాక్కోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. భూమిని కన్నతల్లి కన్నా మిన్నగా భావించే రైతుల నుండి వాటిని లాక్కోవడమంటే, బిడ్డ నుంచి తల్లిని బలవంతంగా దూరం చేయడమేనని అన్నారు. ఈ రోజు మూడు జిల్లాల్లో జరిగిన దుర్ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయంటూ వరుస ట్వీట్లు చేశారు.

తన పొలంలో వైసీపీ నేతలు రాళ్లు పాతారన్న ఆవేదనతో కర్నూలు జిల్లా, ఎర్రగూడూరులో ఓ మహిళా రైతు భూ లక్ష్మి ఆత్మహత్య, శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలో వారి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని అడ్డుకున్న దళితులను అరెస్ట్ చేయడం, గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో భూమి కోసం పురుగుమందు తాగుతాం అంటూ పేదలు ప్రాణాలకు తెగించారంటూ ఆ మూడు ఘటనలను ప్రస్తావించారు.

కళ్లుండీ చూడలేని ప్రభుత్వ నిర్వాకాలకు నిలువుటద్దాలు ఈ ఘటనలు అని, ‘మా భూమి జోలికొస్తే చచ్చిపోతాం' అంటోన్న రైతుల ఆక్రందనలు మనసును కలచివేస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News