Corona Virus: దేశంలో 28 మందికి కరోనా వైరస్​.. అధికారికంగా ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రి

Total 28 Corona cases identified says Union Health Minister Harsh Vardhan
  • వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నాం
  • ల్యాబ్ లు, ఐసోలేషన్ వార్డులు పెంచుతున్నాం
  • వైరస్ సోకిన ప్రాంతాల్లో చుట్టూ మూడు కిలోమీటర్ల మేర కెమికల్ స్ప్రే
దేశంలో ఇప్పటివరకు 28 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఢిల్లీలో వైరస్ సోకిన వ్యక్తి కుటుంబానికి, ఆగ్రాలో నివసిస్తున్న మరో ఆరుగురికి కరోనా సోకినట్టుగా గుర్తించామని తెలిపారు.

రాజస్థాన్ కు వచ్చిన ఇటాలియన్లలో 16 మందికి కూడా వైరస్ ఉన్నట్టు తేలిందని, ఇప్పటికే కేరళలో మూడు, ఢిల్లీలో ఒకటి, తెలంగాణలో మరొక కేసు నమోదయ్యాయని చెప్పారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 28 మందికి వైరస్ సోకినట్టు ఇప్పటివరకు సమాచారం అందిందని తెలిపారు. పెద్ద సంఖ్యలో అనుమానితులకు వైద్య పరీక్షలు చేస్తున్నామని వివరించారు.

అన్ని జాగ్రత్తలు చేపడుతున్నాం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అన్ని విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చినవారికి స్క్రీనింగ్ చేస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు నివసించిన, స్టే చేసిన ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేయిస్తున్నామని, చుట్టూ మూడు కిలోమీటర్ల వరకు వైరస్ నిరోధక చర్యలు చేపట్టామని వివరించారు.

ల్యాబ్ లు, ఐసోలేషన్ వార్డులు పెంచుతున్నాం

ఢిల్లీతోపాటు వైరస్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇరాన్ లో కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని, అక్కడి నుంచి వచ్చే వారికి అక్కడే పరీక్షలు చేసి తీసుకువస్తే బాగుంటుందని భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిసినట్టు తేలిందని వివరించారు. మన దేశానికి వచ్చిన విదేశీయులు వెనక్కి వెళ్లాలన్నా ఆయా దేశాలు రానివ్వడం లేదన్నారు. అలాంటి వారిని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచుతున్నామని ప్రకటించారు.
Corona Virus
New Delhi
Covid19
Telangana
Central Minister
Harhavardhan

More Telugu News