Vellampalli Srinivasa Rao: టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడ్డారు: ఏపీ మంత్రి వెల్లంపల్లి విమర్శలు

Minister Vellampalli criticises TDP Leaders
  • జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని సీఎం భావించారు
  • బీసీలపై టీడీపీకి ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమైంది
  • 16 లక్షల మందికి కొత్తగా పెన్షన్ లు ఇస్తుంటే దుష్ప్రచారం చేస్తారా?
బీసీల ఎదుగుదల చూసి టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి సుడిగాలి పర్యటన చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రోజుకో వార్డులో పర్యటనలో భాగంగా ఇవాళ ఓ వార్డులో పర్యటించారు. 26వ డివిజన్‌ భవానీపురం, కామకోటి నగర్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించిన వెల్లంపల్లి సమస్యలపై ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సీఎం వైఎస్ జగన్ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని, నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు.

ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగానే చూసిందని, వారి అభివృద్ధికి పాటుపడ లేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష టీడీపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తోందని, జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని సీఎం భావిస్తే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డు పడ్డారని ఆరోపించారు.

బీసీలపై టీడీపీకి ఉన్న ప్రేమ ఏపాటిదో  బయటపడిందని, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప టీడీపీకి ప్రజా సంక్షేమం అవసరం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. టీడీపీ హయాంలో 44 లక్షల మందికి పెన్షన్ లు ఇస్తే సీఎం జగన్ 60 లక్షల మందికి అందిస్తున్నారని అన్నారు. పదహారు లక్షల మందికి కొత్తగా పెన్షన్ లు ఇస్తుంటే ఉన్నవి తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
Vellampalli Srinivasa Rao
YSRCP
Telugudesam
Leaders

More Telugu News