Lok Sabha: దద్దరిల్లిన లోక్‌సభ.. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట

Opposition parties demonds Shah resignation in Lok Sabha
  • ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో అమిత్ షా రాజీనామాకు డిమాండ్
  • వెల్‌లోకి దూసుకెళ్లి నల్లటి బ్యానర్‌తో నినాదాలు
  • సభలో వేడిపుట్టించిన ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు
సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే లోక్‌సభ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ అల్లర్లపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షా రాజీనామా చేయాలంటూ నల్లటి బ్యానర్ ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం సమీపానికి వెళ్లి నిరసన తెలిపారు.

సభలో కాంగ్రెస్ నిరసనలపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా స్పందించారు. 1984లో వారే 300 మందిని హత్య చేశారని విమర్శించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు మరింత రెచ్చిపోయారు. ‘వియ్ వాంట్ జస్టిస్.. అమిత్ షా ముర్దాబాద్’ అని నినాదాలు చేశారు. ‘వివాద్ సే విశ్వాస్’ బిల్లుపై ప్రసంగిస్తున్న సయంజ్ జైస్వాల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని వెనక్కి వెళ్లాలని  బీజేపీ సభ్యులు రమేశ్‌ బిధూరి, నిషికాంత్‌ దూబే డిమాండ్‌ చేశారు. పట్టించుకోని కొందరు కాంగ్రెస్‌ సభ్యులు కాగితాలను చింపి గాలిలోకి విసిరేశారు. దీంతో వెనుక కూర్చున్న బీజేపీ సభ్యులు కూడా ముందుకు దూసుకొచ్చారు.

దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. గట్టిగా ఒకరినొకరు నెట్టుకోవడంతో సభను మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. తమవైపు నుంచి వెల్‌లోకి వెళ్లనివ్వకుండా బీజేపీ సభ్యులు ప్రతిపక్ష సభ్యులను అడ్డుకున్నారు. మరోవైపు బీజేపీ మహిళా ఎంపీ ఒకరు తనపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రమ్య హరిదాస్‌ స్పీకర్‌‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మరోమారు గందరగోళం చెలరేగింది. దీంతో సభను నేటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.  
Lok Sabha
Congress
BJP
Amit Shah

More Telugu News