మొబైల్ వినియోగదారుల నెత్తిన మరో పిడుగు.. డేటా, కనెక్షన్ చార్జీలు పెంచాలంటూ ప్రభుత్వానికి వొడాఫోన్ లేఖ
- డేటా చార్జీలను ఏడెనిమిది రెట్లు పెంచాల్సిందే
- అవుట్ గోయింగ్ కాల్స్‌పై ఉచితాన్ని ఎత్తివేయాలి
- ఏప్రిల్ ఒకటి నుంచే అమలు కావాలి
ప్రస్తుతం ఒక జీబీ డేటా సగటున నాలుగైదు రూపాయలకు లభిస్తోంది. దీనిని ఏడెనిమిది రెట్లు పెంచి కనీసం రూ.35గా చేయాలని, అవుట్ గోయింగ్ కాల్స్‌పై ప్రస్తుతం ఉన్న ఉచితాన్ని ఎత్తివేసి నిమిషానికి ఆరు పైసలను కనీస చార్జీగా నిర్ణయించాలని కోరింది. అలాగే, కనీస కనెక్షన్ చార్జీని రూ. 50గా నిర్ణయించాలని అభ్యర్థించింది. ఇలా చేస్తే తప్ప కంపెనీల మనుగడ సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రభుత్వం కనుక ఇందుకు అంగీకరిస్తే వినియోగదారుల జేబులు చిల్లులు పడడం ఖాయం. మరోవైపు ఇంచుమించు ఇలాంటి డిమాండ్లతోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్)కు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) లేఖ రాసింది. టెలికం పరిశ్రమను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ (డీసీసీ) నేడు సమావేశం కానుంది.